నల్గొండలో ఓ అవినీతి తిమింగలం బయటపడింది. విద్యుత్తు శాఖలో డీఈగా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఏకంగా వందకోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. 

నల్గొండ : nalgonda జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడలోElectricity DE మురళీధర్రెడ్డి ACBకి చిక్కిన కేసులో పలు విషయాలు వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్, నల్గొండ, నడిగూడెంలలో తనిఖీలు చేసిన అధికారులు కోట్ల విలువైన ఫ్లాట్ల కాగితాలు, తోటల వివరాలు, ఆస్తుల దస్తావేజులతో పాటుగా బంగారు, వెండి, డైమండ్ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ. వందకోట్లకు పైగా ఉన్నట్లు తెలిసింది. మురళీధర్ రెడ్డి మిర్యాలగూడలో టెక్నికల్ ఏఈగా పనిచేయడంతో పాటుగా, హాలియాలో ఏఈగా, దేవరకొండ ఏడీఈగా, చౌటుప్పల్ డీఈగా పనిచేశారు. దేవరకొండకు చెందిన శివకుమార్ పేరిట బినామీ లైసెన్స్ తెరిచి ఆయన పనిచేసిన ప్రతిచోటా రూ. కోట్లతో పనులు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఇదిలా ఉండగా, నిరుడు జనవరిలో తూర్పుగోదావరి జిల్లాలో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఇరిగేషన్‌ హెడ్‌వర్క్స్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పల్లంకుర్తి పద్మారావు ఆస్తులపై సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.1.50 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. 

పద్మారావు ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులకు పలు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ధవళేశ్వరం మసీదు వీధిలోని పద్మారావు ఇల్లు, మండపేటలోని అతని బావమరిది ఇల్లు, గోపాలపురంలోని చెల్లెలి భర్త ఇల్లు, పద్మారావు పనిచేస్తున్న ధవళేశ్వరం హెడ్‌వర్క్స్‌ కార్యాలయాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

ధవళేశ్వరంలోని ఇల్లు, రాజమహేంద్రవరంలో శీలం నూకరాజు వీధిలో ఒక ఇల్లు, మండపేటలో రూ.10లక్షలు విలువైన స్థలం, రూ.10లక్షల బంగారం, కొంత నగదు, వెండి వస్తువులను ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటి విలువ సుమారు 1.50 కోట్లుగా నిర్ధారించారు. 

పద్మారావు పేరున పలు బ్యాంక్‌ ఖాతాలు ఉన్నాయని వాటిని పరిశీలించాల్సి ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ పి.రామచంద్రరావు, రాజమహేంద్రవరం రేంజ్‌ సీఐ పీవీ సూర్యమోహనరావు, వి.పుల్లారావు, డి.వాసుకృష్ణ, పీవీజీ తిలక్, ఎస్సైలు టి.నరేష్, బి.సూర్యం పాల్గొన్నారు. ఇరిగేషన్‌లోని పలువురు ఉన్నతాధికారులు పద్మారావుకు అత్యంత సన్నిహితంగా ఉంటారు. గతంలో పద్మారావుపై ఆరోపణలు వచ్చినా ఏవిధమైన చర్యలు తీసుకోలేదు. 

ఇలాంటి కేసే నిరుడు మరొకటి బయటపడింది. అతనో సాధారణ ఎలక్ట్రికల్ ఇంజనీర్...జీతం, గీతం కలిపి తాను సర్వీస్ చేసిన కాలంలో సంపాదిస్తే 2, 3 కోట్లు. కానీ అతను సంపాదించిన ఆస్తులు చూసి ఇప్పుడు ఏసీబీ అధికారులులే షాక్ అవుతున్నారు. కొమ్మది ఎలక్ట్రికల్ ఏఈ నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై ఏసీబీ అధికారులు గురువారం ఆరు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నాగేశ్వరరావుకు విశాఖలో సీతమ్మధార, సీతంపేట, విశాలాక్షి నగర్, ఎంవీపీ కాలనీ, రాంబిల్లి ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూములు, ఇల్లు, స్థలాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

అలాగే 3 బ్యాంకు లాకర్‌లు సీజ్ చేశారు. 1991లో సర్వీసులో చేరిన నాగేశ్వరరావు 94లో ఏసీబీ అధికారులకు చిక్కి సస్పెండ్ అయ్యారు. 2012లో తిరిగి విధుల్లో చేరిన నాగేశ్వరరావు లంచం ఇవ్వనిదే మీటర్ కనెక్షన్ కూడా మంజూరు చెయ్యారనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి.