మైనర్ బాలిక మీద అత్యాచారం కేసులో టీఆర్ఎస్ నేత సాజిద్ ఖాన్ ను పార్టీనుంచి సస్పెండ్ చేసినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. దోషిగా తెలితే శాశ్వత బహిష్కరణ ఉంటుందని చెప్పుకొచ్చారు.
నిర్మల్ : బాలికపై rape caseలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ TRS నుంచి సస్పెండ్ చేసినట్లు మంత్రి Indrakaran Reddy సోమవారం నిర్మల్లో ప్రకటించారు. విచారణలో దోషిగా తేలితే పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తామని చెప్పారు. బాధిత బాలికకు ప్రభుత్వం తరఫున న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు…. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్ ఖాన్ ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించడంతోపాటు అరెస్టు చేయాలని BJP డిమాండ్ చేసింది.
ఈ మేరకు సోమవారం బిజెపి చేపట్టిన నిర్మాణ మునిసిపల్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. భారీ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న బిజెపి నాయకులు కమిషన్ ఛాంబర్ ముందు బైఠాయించి నినాదాలు ఇచ్చారు. అక్కడే ఉన్న మున్సిపల్ చైర్మన్ తో పాటు పలువురు టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అండదండలతోనే నిందితుడు షేక్ సాజిద్ ఖాన్ తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరువర్గాలను సముదాయించి శాంతింపజేశారు.
ఇదిలా ఉండగా, నిన్న అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అభంశుభం తెలియని ఓ బాలికపై rapeకి ఒడిగట్టాడు. ఈ ఘాతుకాన్ని గోప్యంగా పెట్టే ప్రయత్నం చేశాడు. victim తల్లి ఫిర్యాదుతో విషయం వెలుగు చూసింది. Nirmal డిఎస్పి ఉపేందర్ రెడ్డి కథనం ప్రకారం…నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్ పేటకు చెందిన టిఆర్ఎస్ నేత షేక్ సాజిద్ స్థానిక వార్డు నుంచి కౌన్సిలర్ గా ఎన్నికై… చిన్నవయసులోనే వైస్ చైర్మన్ పదవిని చేపట్టాడు. ఇటీవల ఓ పూజా కార్యక్రమానికి హాజరైన sajid…అక్కడ ఓ 16 ఏళ్ల బాలికపై కన్నేశాడు. అంతే ఆ బాలికను శారీరకంగా లొంగదీసుకునేందుకు అన్నపూర్ణమ్మ అనే మహిళను రంగంలోకి దింపాడు.
అన్నపూర్ణమ్మ ఆ బాలికను నమ్మించి నిజామాబాద్ వరకు వెళ్లాలి తోడు రమ్మంటూ వెంటబెట్టుకుని వెళ్ళింది. ఆ తర్వాత ‘హైదరాబాదులో ఓ దావత్ ఉంది అక్కడికి వెళుతున్నా.. ఇక్కడిలా కాదు.. అక్కడ గ్రాండ్ గా ఉంటుంది ఫంక్షన్.. నువ్వు కూడా రావచ్చు కదా?’ అంటూ ఆఫర్ ఇచ్చింది. సాయంత్రానికి తిరిగి వచ్చేయొచ్చని.. కారులోనే వెళ్దామని చెప్పింది. దీంతో తెలిసిన మహిళా కదా అని ఆ బాలిక సరే అని చెప్పింది. ఆ తర్వాత ఆ మహిళ ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది. కాసేపటికి ఒక కారు వచ్చింది. డ్రైవర్, అన్నపూర్ణతో కలిసి ఆ బాలిక కారులో బయలుదేరింది. చార్మినార్ సమీపంలోని ఓ లాడ్జిలో అప్పటికే బస చేసిన వైస్ చైర్మన్ షేక్ సాజిద్ కు ఆ బాలికను అప్పగించింది.
అతను ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమెను బెదిరించి, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశాడు. భయం భయంగా ఇంటికి వచ్చిన బాలికను... విషయం ఏంటని తల్లి ప్రశ్నించడంతో తనపై జరిగిన అఘాయిత్యాన్ని వివరించింది. దాంతో ఆ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాజిద్ పై పోక్సో, ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. sajidకు సహకరించిన అన్నపూర్ణమ్మ, నిజామాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చిన కారు డ్రైవర్లను నిందితులుగా చేర్చారు. ఈ ముగ్గురు పరారీలో ఉన్నారని డిఎస్పీ వివరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా సంఘాలు గళమెత్తాయి. ఘటనతో అధికార టీఆర్ఎస్ లో తీవ్ర కలకలం రేగుతోంది.
పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధం
షేక్ సాజిద్ పై రేప్ కేసు నమోదు కావడంతో అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ వర్గాల నుంచే డిమాండ్ పెరుగుతోంది. దీనిపై పార్టీ శ్రేణులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. విచారణ కమిటీ వేసి, కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. సాజిద్ ఇంకా పార్టీలో ఉంటే.. చెడ్డపేరు తప్పదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. అతనిని తొలగించకుంటే.. పార్టీకే పెద్ద మచ్చ అని ఆందోళన వ్యక్తం చేశారు.. అటు సాజిద్ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవికీ ముప్పు తప్పదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
నిర్మల్ పరిసరాల్లోనే నిందితులు?
నిందితులను అరెస్టు చేసేందుకు నిర్మల్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అదే సమయంలో సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. వారి సెల్ ఫోన్లు స్విచాఫ్ అయినట్లు గుర్తించారు. వారి సెల్ టవర్ సిగ్నల్ చివరి సారి నిర్మల్ పరిసరాల్లోనే చూపించినట్లు తెలిసింది. వారు తలదాచుకునే అవకాశాలున్న ప్రాంతాలపై పోలీసులు నిఘా పెట్టారు. ‘సోమవారం తెల్లవారుజాముకల్లా అరెస్టులు జరిగే అవకాశం ఉంది’ అని ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటనపై సోమవారం జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలున్నాయి.
