కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. తల్లి, తండ్రి సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోతుంది. అదనంగా తన చదువు వాళ్లకి భారం కాకూడదని బావించాడు ఓ 13ఏళ్ల కుర్రాడు.అందుకే... తన ఖర్చుల వరకు తానే సంపాదించుకోవాలనే ఆలోచనతో పేపర్ బాయ్ గా మారాడు. కుటుంబానికి అండగా నిలుస్తూ... చదువుకుంటున్న ఆ కుర్రాడిని విధి కాటేసింది. రోడ్డు ప్రమాదంలో.. తీవ్రగాయమై ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బాగ్ అంబర్ పేటకు చెందిన వెంకట్రావు, సంగీత దంపతుల కుమారుడు అభినవ్(13). 9వ తరగతి చదువుతున్నాడు. తండ్రి వెంకట్రావు ఓ ప్రైవేటు సంస్థలో చిరు ఉద్యోగి. తల్లి డీడీ కాలనీలోని నారాయణ స్కూల్లో ఆయాగా పనిచేస్తోంది.  కాగా.. అభినవ్ అదే స్కూల్లో చదువుకుంటున్నాడు. 

రోజూ ఉదయం పేపర్ వేసి ఆ తర్వాత స్కూల్ కి వెళ్లేవాడు. రోజూలాగే మంగళవారం కూడా అభినవ్ పేపర్ వేయడానికి ఏజెంట్ దగ్గరకు వెళ్లాడు. ఆ రోజు ఏజెంట్‌ దగ్గర పనిచేసే మరో పేపర్‌ బాయ్‌ రాకపోవడంతో అతడికి సంబంధించిన పేపర్లు ఓయూ గేట్‌ వద్ద ఇవ్వడానికి ఏజెంట్‌ బైక్‌ను తీసుకొని అభినవ్‌ ఒక్కడే వెళ్లాడు. మెయిన్‌ రోడ్డు మీద అదుపు తప్పిన ద్విచక్రవాహనం సర్వీసు రోడ్డులోని గుంతల్లో దిగి ఎగిరింది. ఆ వేగంలోనే డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌కు అభినవ్‌ తల బలంగా తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. 

రక్త స్రావం ఎక్కువగా జరగడంతో... అభినవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అభినవ్‌ తల్లిదండ్రుల పేదరికం తెలిసి.. అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, నారాయణ స్కూల్‌ ప్రిన్సిపల్‌ రూ. 10వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అభినవ్‌ చదివే స్కూలుకు మంగళవారం సెలవు ప్రకటించారు.