వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. వయసుతో సంబంధం లేకుండా మైనర్లుగా వున్నపుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇలా ప్రేమ బంధంతో దగ్గరైన ఈ జంట పెళ్లి చేసుకొని ఒక్కటవ్వాలని అనుకున్నారు. అయితే అందుకు ఇరు కుటుంబాలు అంగీకరించలేవు. దీంతో కలిసి బ్రతకలేకపోయినా కలిసి చావాలని నిర్ణయించుకుని   పురుగుల మందు తాగి ప్రాణత్యాగానికి పాల్పడ్డారు. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మల్లేశ్, శిల్పలు గతకొంతకాలంగా  ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు మైనర్లుగా వున్నపుడే వీరి ప్రేమ మొదలయ్యింది. అయితే వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసి ఘర్షణకు దారితీసింది. 

ఈ క్రమంలోనే తామిద్దరం పెళ్లి చేసుకోడానికి సిద్దంగా వున్నామని ఈ ప్రేమజంట కుటుంబసభ్యులను సముదాయించే ప్రయత్నం చేసింది. అయితే మీరింకా చిన్నపిల్లలు...మీకేం తెలీదంటూ కుటుంబ సభ్యులు వారి మాటలను వినిపించుకోలేదు. మరోసారి మీరు కలిస్తే బావుండదని వారిని బెదిరించారు. దీంతో ఇక కలిసి బ్రతకలేమని బావించిన వారు కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. 

ఇలా బుధవారం అర్థరాత్రి ఇంట్లో అందరు పడుకున్నాక బయటకు వచ్చిన వీరు గ్రామానికి సమీపంలోని పొలాల్లోకి చేరుకున్నారు. అక్కడ  తమతోపాటు తెచ్చుకున్న పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. 

ఈ ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న స్థానికక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అలాగే కేసుు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పిల్లల పెళ్లికి అంగీకరించకుండా తామే వారిని బలితీసుకున్నామంటూ ఇరు కుటుంబాలు మృతదేహాల వద్ద బోరున విలపిస్తున్నారు.