చావుబతుకుల్లో ఉన్న బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళితే.. బిడ్డ ప్రాణాలతో ఉండగానే చనిపోయిందని తేల్చి చెప్పారు వైద్యులు. అంతేకాదు పోస్టు మార్టం కి కూడా తరలించారు. ఆ తర్వాత నిజంగానే ఆ బిడ్డ తన తుది శ్వాసను విడిచింది. ఈ దారుణ సంఘటన హన్మకొండ పట్టణంలో మంగళవారం జరిగింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామ పంచాయతీ పరిధి హవల్దార్‌పల్లికి చెందిన గూళ్ల సదానందం కుమార్తె రిషిత(13) ఈ నెల 19న ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి పాము కాటేసింది. కుటుంబ సభ్యులు తొలుత ముల్కనూర్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి, మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. 

అక్కడ వైద్యులు పట్టించుకోకపోవడంతో హన్మకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలిక చనిపోయినట్టు మంగళవారం నిర్ధారించారు. శవ పరీక్ష కోసం ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎం వైద్యులు ఆమె బతికే ఉన్నట్టు గుర్తించి..అత్యవసర చికిత్స అందించారు. చికిత్స పొందుతూ బాలిక సాయంత్రం కన్నుమూసింది. బతికుండగానే చనిపోయినట్టు ధ్రువీకరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. ఘటనపై కేసు నమోదు చేసినట్టు ముల్కనూర్‌ ఎస్సై డ్యాగల రమేశ్‌ తెలిపారు.