హైదరాబాద్: హైద్రాబాద్ బోరబండలో ఆదివారం నాడు మరోసారి భూమి స్వల్పంగా కంపించింది. రెండు రోజుల వ్యవధిలో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు.

ఈ నెల 2వ తేదీన భూప్రకంపనలతో ప్రజలు ఆందోళనలకు గురయ్యారు. రెండో తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల నుండి 9 గంటల మధ్య సుమారు 15 దఫాలు భూమి కంపించినట్టుగా స్థానికులు చెప్పారు.

జూబ్లీహిల్స్, రహమత్ నగర్, బోరబండ సైట్ 3, ఎస్పీఆర్ హిల్స్, అల్లాపూర్ లలో భూమి కంపించింది. భూకంప తీవ్రత 1.5 గా నమోదైంది.అదే రోజు రాత్రి 11 గంటల 25 నిమిషాలకు మరోసారి భూమి కంపించింది.

ఆదివారం నాడు కూడ మరోసారి  భూ ప్రకంపనలు రావడంతో  ప్రజలు భయంతో ఇళ్ల నుండి పరుగులు తీశారు. ఈ ప్రాంతంలో భూ ప్రకంపనలకు గల కారణాలను విశ్లేషించేందుకు అధికారులు ప్రయత్నాలను ప్రారంభించారు.

రెండు రోజుల క్రితం వచ్చిన శబ్దాల కంటే ఇవాళ వచ్చిన శబ్దాలు భారీగా పెద్ద శబ్దంతో వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. వరుసగా భూమిలో నుండి భారీగా శబ్దాలు వస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

భారీ శబ్దాలతో భూమి కంపించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి పొరల్లో నీరు చేరుతున్న సమయంలో శబ్దాలు వస్తాయని శ్రీనగేష్ చెప్పారు.ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన ప్రకటించారు.