మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్నతండ్రినే అతి కిరాతకంగా కర్రతో ఇష్టంవచ్చినట్లు చచ్చేలా కొట్టిందో మైనర్ కూతురు. కూతురు దెబ్బలు తాళలేక తండ్రి ప్రాణాలు కోల్పోయాడు.
మహబూబాబాద్: మానవ సంబంధాలను మచ్చలా నిలిచే దారుణం తాజాగా తెలంగాణలో చోటుచేసుకుంది. ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచిన కన్న తండ్రినే అతికిరాతకంగా హతమార్చింది ఓ కసాయి కూతురు. 17ఏళ్ల మైనర్ యువతి ఇలా తండ్రిని చంపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే...మహబూబాబాద్ జిల్లాకేంద్రానికి సమీపంలోని వేమునూరు గ్రామానికి వెంకన్న(46) కూతురు ప్రభావతి(17) ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆమెకు కూడా నాన్నతో ఎంతో ప్రేమగా వుండేది. అయితే ఈ తండ్రికూతురు మధ్య ఏ విషయంలో తేడావచ్చిందో కానీ బంధాలను మరిచి హత్యచేసుకునే స్థాయిలో ద్వేషించుకున్నారు. చివరకు కన్నతండ్రిపై ప్రేమ అటుంచి కనీసం జాలికూడా లేకుండా అతి కిరాతకంగా హతమార్చింది కసాయి కూతురు.
ఆస్తి విషయంలోనే తండ్రీ కూతురికి మధ్య చెడినట్లు తెలుస్తోంది. ఆస్తి పత్రాలు ఇవ్వాలని ఈ మైనర్ కూతురు కోరగా తండ్రి అందుకు నిరాకరించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ప్రభావతి వెనకాముందు చూసుకోకుండా కన్నతండ్రిని కర్రతో చితకబాదింది. వెంకన్న ఆర్దనాదాలు విని చుట్టుపక్కల ఇళ్ళవారు చేరుకుని ఆమెను ఆపేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ఇలా కర్రతో ఎక్కడపడితే అక్కడ కొట్టడంతో వెంకన్న ప్రాణాలు కోల్పోయాడు.
స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రభావతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వెంకన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆస్తి కోసమే కూతురు తండ్రిని చంపిందా లేక మరేదయినా కారణముందా అన్నది తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు.
మైనర్ కూతురు కన్న తండ్రిని చంపిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో సంచలనంగా మారింది. ఆస్తుల కోసం కనిపెంచిన వారినే చంపుతున్న ఘటనలు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని నిరూపిస్తున్నాయి.
ఇదిలావుంటే మానవ సంబంధాలకు మచ్చలాంటి మరో ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. మానసిక వికలాంగురాలిపై వావివరసలు మరిచి సొంత పెదనాన్నే అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఈ విషయం తెలిసి యువతి పెద్దమ్మ భర్తను అడ్డుకోలేదు కదా డబ్బులకు కక్కుర్తి పడి మరింత దుర్మార్గంగా ప్రవర్తించింది. ఓ ఏఆర్ కానిస్టేబుల్ నుండి డబ్బులు తీసుకుని యువతిని అతడికి అప్పగించింది. ఇలా ఈ ముగ్గురూ కలిసి సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 14 ఏళ్ల బాలిక ఎనిమిదేళ్ల క్రితం నిజామాబాద్ లో నివాసముండే పెదనాన్న, పెద్దమ్మ వద్దకు చేరింది. అయితే కామంతో కళ్లుమూసుకుపోయిన పెదనాన్నవయసు, వావివరుసలు మరచి ప్రవర్తిస్తే.. డబ్బులకోసం పెద్దమ్మ మరింత నీచానికి దిగజారింది. వీరి పాపంపండి తాజాగా యువతిపై జరుగుతున్న అఘాయిత్యం వెలుగుచూసింది.
యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్రకాంత్, బాధితురాలి పెదనాన్న, పెద్దమ్మ లను పోలీసులు నిందితులుగా చేర్చారు. బాధితురాలితో పాటు ఆమె చెల్లిని సంరక్షణ నిమిత్తం సఖీ కేంద్రానికి తరలించారు.
