నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

అంతకుముందు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించిన ఐదున్నర సంవత్సరాలలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందన్నారు.

ఈ విజయాలు ఇచ్చిన స్ఫూర్తితో కొత్త ఏడాదిలో ప్రజలంతా సంకల్ప సాధనకు కృషి చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో 2020లో ఈచ్ వన్-టీచ్ వన్ అంటూ కొత్త నినాదాన్ని ఇచ్చారు సీఎం.

తెలంగాణను వందశాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంలో తీర్చిదిద్దాలన్నదే ఈ కొత్త నినాదం లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రతీ ఒక్క తెలంగాణ పౌరుడు.. కనీసం ఒక్కరికన్నా విద్య నేర్పించాలన్నదే ఈ సంకల్ప లక్ష్యమన్నారు.

చదువుకున్న ప్రతీ ఒక్కరు కనీసం ఒక్కరికి విద్య నేర్పినా ఏడాదిలో తెలంగాణ వందశాతం అక్షరాస్యతా రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందని, ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కోరారు.