ఏ ఆధారాలతో ఫోన్లు ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు?.. ఆడబిడ్డపై మీ ప్రతాపమా?: మంత్రి శ్రీనివాస్ గౌడ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేంద్రంలోని అధికార బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగిందని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేంద్రంలోని అధికార బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగిందని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత నవంబర్‌లోనే ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత ఈడీ విచారణకు సంబంధించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. ధ్వంసం చేయని ఫోన్లను ధ్వంసం చేసినట్టుగా ఎమ్మెల్సీ కవితపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఫోన్లు ధ్వంసం చేయలేదని కవిత గతంలో పలుమార్లు మీడియాకు తెలియజేశారని చెప్పారు.
‘‘ఆడబిడ్డపై మీ ప్రతాపమా?’’ అంటూ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కవితకు ఈడీ అధికారులు ఎలాంటి సమన్లు ఇవ్వకముందే.. బీజేపీ నేతలు నవంబర్‌లో కవితపై ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ఈడీ అడిగిన తర్వాత ఈరోజు కవిత తన ఫోన్లను వారికి సమర్పించారని చెప్పారు. ఏ ఆధారంతో కవిత ఫోన్లను ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. ఫోన్‌లు ధ్వంసం చేశారని చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అబద్దపు ప్రచారం చేసినందుకు కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి అబద్దాలు చెప్పడం సరికాదని అన్నారు.
తెలంగాణ కోసం కోట్లాడిన మహిళను రోజూ విచారణకు పిలిచి వేధిస్తున్నారని అన్నారు. గంటల తరబడి కూర్చొబెట్టి ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. వంద కోట్ల స్కామ్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే స్కామ్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. అదానీ లక్షల కోట్ల రూపాయలు రూ. లక్షల కోట్ల స్కామ్‌లు చేసిన వారిని వదిలిపెట్టి.. వంద కోట్ల స్కామ్ చేసిందని ఆరోపిస్తూ కవితను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్రాన్ని ప్రశ్నిస్తే చేస్తున్నామనే టార్గెట్ చేస్తున్నారని.. తప్పుడు కేసులతో వేధిస్తున్నారని విమర్శించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ.. లేనివి ఉన్నట్టుగా సృష్టించి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు.