తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గవర్నర్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ పరమైన హోదాలో ఉన్న గవర్నర్‌.. పరిమితులకు లోబడి మాట్లాడాలన్నారు. 

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గవర్నర్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ పరమైన హోదాలో ఉన్న గవర్నర్‌.. పరిమితులకు లోబడి మాట్లాడాలన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదని తలసాని వ్యాఖ్యానించారు. గవర్నర్‌ వ్యవస్థ ఉండకూడదని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్‌ అని.. ఆ వ్య‌వ‌స్థ అవస‌ర‌మే లేద‌ని అన్నారు. మీడియాతో గవర్నర్‌ రాజకీయాలు మాట్లాడకూడదని తలసాని అన్నారు. గవర్నర్‌ ఎలా గౌరవించాలో తమతో పాటు తమ సీఎం కేసీఆర్‌కు తెలుసన్నారు. గవర్నర్‌ను, గవర్నర్‌ కార్యాలయాన్ని ప్రభుత్వం అగౌరవపరచలేదన్నారు.

ప్ర‌ధాని, కేంద్ర‌ మంత్రిని క‌లిసిన త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వంపై గ‌వ‌ర్న‌ర్ విమ‌ర్శ‌లు చేయ‌డం ఏమిటని తలసాని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లు ఎన్నుకున్న‌, మెజార్టీ ఉన్న ప్ర‌భుత్వాన్ని గ‌వ‌ర్న‌ర్ ఎలా ర‌ద్దు చేస్తారని ప్రశ్నించారు. పెద్దల సభలో నియామకాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందేనని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను రాజ్యసభకు పంపడం లేదా అని ప్రశ్నించారు. డ్రగ్స్ విషయంలో కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారని.. ఎంతటి వారున్నా ఉపేక్షించవద్దని అధికారులను ఆదేశించారని తలసాని చెప్పారు. 

నాడు ఎన్టీఆర్‌ను గద్దె దింపడానికి గవర్నర్‌ను వాడుకున్నారని మంత్రి తలసాని అన్నారు. గవర్నర్ పదవిలో ఉన్నవారు రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజకీయాలు మాట్లాడలేనని అని చాలా సార్లు చెప్పారని గుర్తుచేశారు. రాజకీయాలు మాట్లాడనని.. పరిధి మేరకే మాట్లాడతానని వెంకయ్య నాయుడు చెబుతుంటారని అన్నారు. 

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై తలసాని విమర్శలు గుప్పించారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ.. ఎన్టీఆర్‌కే చేసినట్టుగా ఇప్పుడు జరగాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారా అని ప్రశించారు. సెక్షన్ 8 అసలు దేనికని.. ఇలా మాట్లాడే పార్టీలు ఉండడడం దౌర్భాగ్యం అని కాంగ్రెస్‌పై మంత్రి తలసాని ఫైర్ అయ్యారు.