ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంబోత్సవం సందర్భంగా జరిగిన ఘటనపై మంత్రి తలసాాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సంఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాను ఓ నాయకున్ని తోసేసింది నిజమేనని... అనుకోకుండా జరిగిన సంఘటనతో తాను చింతిస్తున్నానని అన్నారు. ఆరోజు జరిగిన ఘటనతో ఎవరి మనోభావాలైనా దెబ్బతినివుంటే క్షమించాని కోరుతూ మంత్రి తలసాని ఓ వీడియోను విడుదల చేసారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కేసీఆర్ సర్కార్ భారీగా ప్లైఓవర్ల నిర్మాణం చేపడుతోంది. ఇందులో భాగంగానే ఇందిరాపార్క్ నుండి ఆశోక్ నగర్, ఆర్టిసి క్రాస్ రోడ్డు మీదుగా వీఎస్టీ వరకు స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. వందలకోట్లు ఖర్చుచేసి నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జిని ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనముందు వెళుతున్న బైంసా మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజేష్ కుమార్ బాబును పక్కకు తోసి కొట్టాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మంత్రి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో తాజాగా ఆయన స్పందించారు.
స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి కేటీఆర్ రావడంతో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారని తలసాని తెలిపారు. ఈ రద్దీలో కేటీఆర్ తో కలిసి వెళుతుండగా ముందున్న వ్యక్తి తన కాలు తొక్కాడని తెలిపారు. బూటుకాలితో తొక్కుతూ ముందుకు వెళ్లడంతో వేలు చిట్లి రక్తం వచ్చిందని అన్నారు. నొప్పి భరించలేకపోయిన తానే కోపంలో తన కాలు తొక్కినవ్యక్తిని పక్కకు తోసేసినట్లు మంత్రి తలసాని వివరించారు.
వీడియో
అయితే తాను తోసేసింది బైంసా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ కుమార్ అని తర్వాత తెలిసిందన్నారు. అతడు గిరిజన బిడ్డ అని తనకు తెలియదని... ఉద్దేశపూర్వకంగా ఆయనను తోయలేదని మంత్రి తెలిపారు. ఆ పరిస్థితిలో ఎవరున్నా తాను అలాగే రియాక్ట్ అయ్యేవాడినని అన్నారు. కానీ కొందరు కావాలనే రాజేష్ బాబును తోసేసిన వీడియోను పదే పదే ప్రచారం చేస్తూ గిరిజనులను అవమానించినట్లు దుష్ఫ్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని అన్నారు.
Read More కేసీఆర్ కాంగ్రెస్ కుక్కలను పిల్లులుగా మార్చారు : పల్లా రాజేశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు...
తాను బడుగు, బలహీన, దళిత, మైనార్టీ, గిరిజన వర్గాల గొంతుకను... అలాంటిది గిరిజన ప్రజాప్రతినిధిని ఎలా అవమానిస్తానని తలసాని అన్నారు. అనుకోకుండా జరిగిన సంఘటనను కొందరు తమ రాజకీయ స్వార్థంకోసం పెద్దది చేస్తున్నారని అన్నారు. ఈ ఘటన తర్వాత తానే రాజేష్ కు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పానని అన్నారు. ఈ వ్యవహారంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు వేణుగోపాలాచారి, దండె విఠల్ తో మాట్లాడినట్లు మంత్రి తెలిపారు.
కాలికి గాయమై రక్తస్రావం కావడం... విపరీతమైన నొప్పి వుండటంతో కోపంతో ఒకరిని నెట్టాల్సివచ్చింది తప్ప తన స్వభావం అలాంటిది కాదన్నారు తలసాని. ఈ ఘటనతో గిరిజన బిడ్డల మనోభావాలు దెబ్బతిని వుంటే క్షమించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.
