రైతులకు వ్యతిరేకంగా బిల్లులు చేపట్టిన ప్రభుత్వాలు కనుమరుగయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంత్రి ఆధ్వర్యంలో నగరంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న విధానాలు సరికాదని హితవు పలికారు. రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు.

కనీస మద్దతు ధర చెల్లించకుండా రైతు పండించిన పంటను ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోమనడం ఎంత వరకు సమంజసమని మంత్రి ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా రైతులు చలిని కూడా లెక్కచేయకుండా ఢిల్లీలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదని మంత్రి మండిపడ్డారు.

రైతుల పక్షాన తెలంగాణ ప్రభుత్వం అన్ని వేళలా అండగా నిలుస్తుందని తలసాని భరోసా ఇచ్చారు.  అనేక సంక్షేమ పథకాలతో రైతులకు తెలంగాణ ప్రభుత్వం మేలు చేస్తోందన్నారు.

కొంత మంది కేంద్ర మంత్రులు ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలను చూసి నోటికి హద్దు లేకుండా మాట్లాడుతున్నారని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులు పండించిన పంటలను ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. వెంటనే నూతన వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.