ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా నమ్మకం వుందని అందుకే వాణీదేవిని గెలిపించారని అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపై ఆయన స్పందిస్తూ.. గత సార్వత్రిక ఎన్నికల్లో లక్ష రూపాయల రుణమాఫీని మేం ప్రకటించామని, రెండు లక్షలు కాంగ్రెస్ ప్రకటించిందని అయినప్పటికీ తమనే గెలిపించారని తలసాని చెప్పారు.

కేసీఆర్‌పై ప్రజలకు విశ్వాసం వుందని 2018 అసెంబ్లీ ఎన్నికలు చెప్పాయని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. పీఆర్‌సీ, ఉద్యోగ భర్తీపై రానున్న రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తలసాని స్పష్టం చేశారు.

ఏదో ఒక సీటులో గెలిచామని విర్రవీగిపోమని.. ఇలా మాట్లాడితే చెంప చెళ్లుమనేలా ఓటర్లు తీర్పు ఇస్తారని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.  నీటి బుడగలు పర్మినెంట్ కాదని, అలాగే సముద్రం పక్కన నిలబడి దీపం పెడితే అది వుంటుందా అంటూ తలసాని వ్యాఖ్యానించారు.

పట్టభద్రులకు కూడా విలువ వుండాలనే ఉద్దేశంతోనే ఎన్నికలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఓడిపోగానే కొందరు కారణాలు వెతుక్కుంటున్నారంటూ బీజేపీ నేతలకు పరోక్షంగా చురకలు వేశారు.

సిట్టింగ్ స్థానం కోల్పోయిన బీజేపీ నేతలు ఇప్పుడేమంటారంటూ ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా కమలనాథులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తలసాని హితవు పలికారు. సింగిల్ పాయింట్ ఏజెండాతో గెలుద్దామంటే కుదరదని ఆయన తెలిపారు.