నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వేళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి సాగర్‌లో చాలా మంచి పేరుందని అన్నారు. ఆయన్ని విమర్శిస్తే స్థానికులు ఊరుకోరంటూ తలసాని వ్యాఖ్యానించారు.

ఈ సంగతిని గ్రహించే తాము ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ, విరుచుకుపడ్డామని మంత్రి వెల్లడించారు. నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, 20 వేల పైచిలుకు మెజారిటీ ఖాయమని తలసాని జోస్యం చెప్పారు.

Also Read:ఎవరి లెక్కలు వారివే: పార్టీల భవిష్యత్ తేల్చేది సాగర్ ఎన్నికనే...

కరోనా వల్ల దేశమే ఇబ్బందుల్లో పడిందని, తెలంగాణలో మాత్రం కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. కరోనా లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులు మానవత్వంతో ఆలోచించాలని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.

వ్యాక్సిన్‌ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని, ఒక్కో రాష్ట్రానికి, ఒక్కో రేటు ఎలా పెడతారంటూ మంత్రి మండిపడ్డారు. దేశంలో ఉద్యోగుల వేతనాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణాయేనని, అయినా కొందరు పీఆర్సీ మీద గగ్గోలు పెడుతున్నారని తలసాని ధ్వజమెత్తారు.