తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికైన పద్మారావు గౌడ్ తో తనకున్న అనుబంధం గురించి మంత్రి తలసాని శ్రీనివాస్ అసెంబ్లీలో బయటపెట్టారు. ఆయన ఏకగ్రీవంగా డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైనందుకు తలసాని  శుభాకాంక్షలు చెబుతూనే కాస్త ఉద్వేగభరితమైన స్పీచ్ ఇచ్చారు. సికింద్రబాద్ కు చెందిన తమ మధ్య రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆత్మీయ అనుబంధం గురించి మాట్లాడుతున్నంత సేపు అసెంబ్లీలో ఉద్వేగభరిమైన వాతావరణం నెలకొంది.

జంటనగరాలైన హైదరాబాద్-సికింద్రాబాద్ మాదిరిగానే తన ఇళ్లు, పద్మారావు ఇళ్లు  రోడ్డుకు అటువైపు, ఇటువైపు దగ్గర్లోనే వుండేవని తలసాని తెలిపారు. ఇలా దగ్గర్లోనే నివాసముంటున్న ఇరు కుటుంబాల మధ్య కొన్ని సారుప్యతలున్నాయని అన్నారు. ఇద్దరివి పెద్ద కుటుంబాలేనని...ఇద్దరికి కుటుంబమంటే ప్రాణమని తెలిపారు. 

ఇక తామిద్దరం మొదటినుండి ప్రత్యర్థులమైనా ఒకరిపై ఒకరు రాజకీయంగా విమర్శించుకున్న సందర్భాలు లేవంటే ఆశ్యర్యం వేస్తుందని తలసాని పేర్కొన్నారు. తామిద్దరి రాజకీయ రంగప్రవేశం కూడా అనుకోకుండానే జరిగిందన్నారు. అయితే ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇద్దరం ఒకే ప్రభుత్వంలో మంత్రిలుగా పనిచేసే స్థాయికి ఎదిగామని తలసాని అన్నారు. 

2004 లో సికింద్రాబాద్ నుండి మొదటిసారి తాను పద్మారావు పోటీ పడినట్లు...అప్పుడు ఆయనే విజయం సాధించాడని తలసాని గుర్తుచేశారు. ఆ తర్వాత 2008 ఉప ఎన్నికల్లో తన గెలవడం జరిగిందన్నారు.  

ఇక ఆ తర్వాత తామిద్దరం వేరువేరు పార్టీల్లో వున్నా ఓ అండర్‌స్టాండింగ్ తో రాజకీయ ప్రయాణం కొనసాగించామని తెలిపారు. తాను 2009 లో సనత్ నగర్ నుండి,   పద్మారావు సికింద్రాబాద్ నుండి పోటీ చేసి ఓడిపోయామని...2014 లో అవే నియోజవర్గాల నుండి  ఇద్దరం గెలిచచామని అన్నారు. ఆ తర్వాత ఇద్దరం ఒకే పార్టీలో మంత్రిగా చేశామని తలసాని వెల్లడించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ తమపై(పద్మారావు) నమ్మకంతో డిప్యూటీ స్పీకర్ పదవి అప్పగించడం శుభపరిణామమని తలసాని అన్నారు. అసెంబ్లీని విజయవంతంగా నడుపుతూ మరింత మంచి పేరు తెలచ్చుకోవాలని కోరుకుంటున్నానంటూ తలసాని తన ప్రసంగాన్ని ముగించారు.