నవతరం అమ్మాయిలకు ఐలమ్మే ఆదర్శం..: వీరనారి జయంతి వేడుకల్లో శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆమెకు నివాళి అర్పించారు.

మహబూబ్ నగర్ : నిజాం పాలనలో దొరలు, భూస్వాముల అరాచకాలను ఎదిరించి ధైర్యసాహనాలు ప్రదర్శించారు వీరవనిత చాకలి ఐలమ్మ. ఇలా బలహీన వర్గాలకు చెందిన మహిళ ఐలమ్మ బలవంతులైన భూస్వాములతో తమ వర్గాల హక్కులకోసం పోరాడారు. ఇలా తెలంగాణ చరిత్రలో వీరవనితగా తనకంటూ ప్రత్యేకస్థానాన్ని దక్కించుకున్న చాకలి ఐలమ్మ 128వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమెను యావత్ తెలంగాణ సమాజం స్మరించుకుంటోంది.
ఇలా ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని హహబూబ్ నగర్ లోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా మంత్రి ఐలమ్మ గొప్పతనం గురించి మాట్లాడారు. పేద, అణగారిన వర్గాల కోసం ఆమె పోరాడారని... భూస్వాముల అరాచకాలను ధైర్యంగా ఎదిరించారని అన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, చివరకు దాడులు జరిగినా భయపడకుండా నిలబడ్డారని అన్నారు. ఆనాడే మహిళా శక్తిని చాటిచెప్పిన ధీరవనిత ఐలమ్మ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు.
స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులు సైతం ఐలమ్మ ధైర్యసాహసాలను కొనియాడారని... ఆమెకు బాసటగా నిలిచారని మంత్రి తెలిపారు. ఆమె రజకురాలు అయినప్పటికి అన్ని వర్గాల కోసం పోరాటం చేసారని... భూస్వాములకు వ్యతిరేకంగా రైతుల పక్షాన నిలిచారని అన్నారు. ఐలమ్మ స్పూర్తితోనే తెలంగాణ ఉద్యమం కొనసాగిందని... చివరకు స్వరాష్ట్రం సాధించుకున్నామని అన్నారు.
Read More మీకు రాజకీయాలతో సంబంధం లేదా?: ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణపై తమిళిసై పై కేటీఆర్ ఫైర్
తెలంగాణ ఏర్పాటుతర్వాత కూడా ఐలమ్మ స్పూర్తిని కొనసాగించామని అన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ అసెంబ్లీ ఏనాడో తీర్మానం చేసిందన్నారు. పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్నిరంగాల్లో అవకాశాలు పొందాలని... చట్టసభలు అందుకు మినహాయింపు కాదన్నారు. అందువల్లే మహిళా రిజర్వేషన్లను బిఆర్ఎస్ ప్రభుత్వం కోరుకుందని అన్నారు.