మురికూపంగా వుండే చెరువు వర్షపునీటితో కళకళలాడటం చూసి తెలంగాణ పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతోషం వ్యక్తం చేసారు.
మహబూబ్ నగర్ : అది పర్యాటక మంత్రిగారి సొంత నియోజకవర్గం. దీంతో పర్యాటకంగా అభివృద్ది చేయడమే కాదు సొంత ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు ఆయన ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇలా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చొరవతో మహబూబ్ నగర్ పట్టణంలో మురికికూపంగా వున్న ట్యాంక్ బండ్ ను ప్రస్తుతం మంచినీటితో కళకళలాడుతోంది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా సొంత నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రి ఆ చెరువును చూసి సంబురపడ్డారు. భారీ వర్షంలోనూ కొద్దిసేపు ఆ చెరువునీటిని అలాగే చూస్తూ సంతోషించారు.
మహబూబ్ నగర్ పట్టణంలో ట్యాంక్ బండ్ అభివృద్ది పనులు ఇటీవలే పూర్తయ్యాయి. ఈ చెరువులో మురికినీరు చేరకుండా చూడాలన్న మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో మరమ్మతులు చేపట్టారు. ఈ పనులు ఇటీవలే పూర్తవగా తాజాగా కురుస్తున్న వర్షాలతో అందులో మంచినీరు చేరింది. దీంతో ఇంతకాలం మురికినీటితో వుండే ట్యాంక్ బండ్ వైపు కన్నెత్తి చూడని ప్రజలు ఇప్పుడు వర్షపునీటితో స్వచ్చంగా మారడంచూసి ఇది మన ట్యాంక్ బండేనా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే అనుభూతిని స్వయంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా పొందారు. సోమవారం బిసి బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం కోసం సొంత నియోజకవర్గానికి విచ్చేసారు పర్యాటక మంత్రి. ఈ క్రమంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద నీరు చేరిన ట్యాంక్ బండ్ ను చూసి సంతోషించారు. తన కాన్వాయ్ ను ఆపి వర్షంలోనే ట్యాంక్ బండ్ కు చేరుకుని ఆ ఆహ్లాదకర వాతావరణాన్ని చూసి తన్మయత్వానికి లోనయ్యారు. వర్షపు నీటితో చెరువు నిండడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని మంత్రి ఆనందం వ్యక్తం చేసారు.
Read More హైదరాబాద్ లో భారీ వర్షాలు : హుస్సేన్ సాగర్ నాలాలో పడి మహిళ గల్లంతు...
మహబూబ్ నగర్ చెరువు త్వరలోనే పూర్తిగా నిండుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేసారు. నిండిన వెంటనే చెరువులో సెయిలింగ్ పోటీలను నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. మహబూబ్ నగర్ లో జాతీయ స్థాయి వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేందుకు కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
