వక్ఫ్ భూములు కబ్జా చేసినట్లుగా వస్తున్న ఆరోపణలపై స్పందించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.  తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని.. అన్ని వర్గాలను కంటికి రెప్పలా కాపాడుతున్నామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

వక్ఫ్ భూములు కబ్జా చేసినట్లుగా వస్తున్న ఆరోపణలపై స్పందించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్ భూములు కబ్జా చేసినట్లు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజలను రెచ్చగొడుతున్నారని.. బీఆర్ఎస్ నేతలపై విపక్షాలకు అక్కసు ఎందుకు అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. మాయమాటలతో ప్రజల ఓట్లు సంపాదించుకోలేరని.. అధిక మెజార్టీతో గెలిచిన తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని కులం చూసి కాదని, గుణం చూసి గెలిపించారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 

తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని.. అన్ని వర్గాలను కంటికి రెప్పలా కాపాడుతున్నామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాను ఏనాడు అహంకారపూరితంగా వ్యవహరించలేదని.. గతంలోనూ తనపై ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. బడుగు బలహీన వర్గాలు ఎదిగితే సహించలేకపోతున్నారని.. కేసీఆర్ వున్నంత వరకు మాకేం కాదని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. నిన్న గాక మొన్న ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో కొట్టుకుంటున్నారని ఆయన చురకలంటించారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం అని చెప్పి.. ఇప్పుడు పురుషులకు మాత్రమేనని అంటున్నారని శ్రీనివాస్ గౌడ్ దుయ్యబట్టారు. నిన్న గాక మొన్న అధికారంలోకి వచ్చారు అప్పుడే గొడవలా అని మంత్రి ఎద్దేవా చేశారు.