ధాన్య సేకరణ, ప్రజాపంపిణీ విధానంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు పౌరసరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పౌర సరఫరాల శాఖ వార్షిక నివేదికను మంత్రి బుధవారం విడుదల చేశారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరసరఫరాల శాఖ చేపట్టిన సంస్కరణలు, విధానాలను పరిశీలించి, అధ్యయనం చేయడానికి గడిచిన ఏడాది కాలంలో కేంద్ర పౌరసరఫరాల శాఖ అధికారులతో పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల పౌరసరఫరాల అధికారులు వచ్చారన్నారు.

వీరితో పాటు ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజర్లు, లిబియా, తజకిస్తాన్‌, కెన్యా, టాన్జానియా తదితర 33 దేశాలకు చెందిన ప్రతినిధులు, అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏషియన్‌ నేషన్స్‌ (ఆసియాన్‌) దేశాల నుంచి గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమాభివృద్ధి తదితర విభాగాలకు చెందిన ప్రతినిధులు వచ్చారని అన్నారు.

ఈ-పాస్‌, ఐరిస్‌, టీ-రేషన్‌ యాప్‌, రేషన్‌ పోర్టబిలిటీ, బియ్యం రవాణా వాహనాలకు జీపీఎస్‌, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వంటి చర్యల ద్వారా ప్రజా పంపిణీ విధానంలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నామని నిరంజన్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ శ్రీ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ శ్రీ అకున్‌ సబర్వాల్‌ పాల్గొన్నారు.