తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సీఎం అయ్యే వరకు తాను పాదరక్షలు ధరించబోనని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. సెప్టెంబరు 17 నుంచే తాను ఈ దీక్షను ప్రారంభించినట్టు తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఎన్నికల ప్రచారం పాల్గొంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సత్యవతి రాథోడ్ శనివారం భువనగిరి జిల్లా రాధానగర్ తండాలో పర్యటించారు. అయితే కాళ్లకు చెప్పులు ధరించకుండానే సత్యవతి రాథోడ్ ప్రచారంలో పాల్గొనడం అక్కడున్న వారి దృష్టిని ఆకర్షించింది.
దీంతో పలువురు చెప్పులు ఎందుకు ధరించలేదని అడగగా.. మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను పాదరక్షలు ధరించబోనని చెప్పారు. సెప్టెంబరు 17 నుంచే తాను ఈ దీక్షను ప్రారంభించినట్టు చెప్పారు. గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. గిరిజనులకు 6 శాతంగా ఉన్న రిజర్వేషన్‌ను సీఎం కేసీఆర్ 10 శాతానికి పెంచారని అన్నారు. వారి కోసం గిరిజన బంధు పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఊహించని విధంగా తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారని తెలిపారు. కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి అయ్యే వరకు పాదరక్షలు ధరించబోనని తెలిపారు.
ఇక, సెప్టెంబరు 17న ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి షెడ్యూల్డ్ తెగలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లను 10 శాతానికి పెంచినప్పటి నుండి మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పులు ధరించకుండానే నడుస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి లేదా ఆమె మంత్రివర్గ సహచరులకు ఎవరికి కూడా ఆమె ప్రతిజ్ఞ గురించి తెలియదు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో సత్యవతి రాథోడ్ ప్రచారం చేస్తున్న సమయంలోనే ఆమె చెప్పులు లేకుండా నడవడాన్ని ప్రజలు గుర్తించడంతో.. ఆమె తీసుకున్న ప్రతిజ్ఞ గురించి వెలుగులోకి వచ్చింది.
