తెలంగాణలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం  గుడ్ న్యూస్ చెప్పింది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఈ నెల నుంచి వేతనాలు పెంచుతున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం ప్రకటించారు.

తెలంగాణలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఈ నెల నుంచి వేతనాలు పెంచుతున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం ప్రకటించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 54,201 మంది కుక్ కమ్ హెల్పర్లకు లబ్దిచేకూరుతుందని చెప్పారు. తమ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ 54,000 మందికి పైగా మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన బాట పట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడింది. 

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జిల్లా విద్యాధికారులతో సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. వేతనాలు పెంపు నిర్ణయం అమలు చేయడం వల్ల సంవత్సరానికి రూ. 108 .40 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారం అందేలా చూడాలని, పర్యవేక్షణ పెంచాలని సూచించారు.

ఇక, పాఠశాల స్థాయిలో విద్యార్థుల కనీస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా రాష్ట్రస్థాయి అచీవ్‌మెంట్ సర్వే నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో చర్యలు తీసుకోనున్నట్టుగా చెప్పారు. పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్షకు ముందే ప్రిపేర్ కాకుండా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థులు ప్రిపేర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. కోటి రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేసే పనులను స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ)కి అప్పగించాలని ఆమె అన్నారు. ఇక, కొంతమంది విద్యార్థులకు యూనిఫాం అందడం లేదని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. వారం రోజుల్లోగా యూనిఫాం లబ్ధిదారులకు అందకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.