టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తాను ఏ విచారణకైనా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. అసవరమైతే సీబీఐ దర్యాప్తు కూడా చేయించాలని పువ్వాడ సవాల్ విసిరారు.
తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తాను ఏ విచారణకైనా సిద్ధమేనని.. అవసరమైతే సీబీఐతో దర్యాప్తు చేయించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భూములు కబ్జా చేశానని తనపై ఆరోపణలు చేస్తున్నారని పువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar) అక్రమాలపై సీబీఐ (cbi) విచారణ జరపాలని డిమాండ్ చేశారు టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) . ఈడీ కేసులు, చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు, మమతా కాలేజీలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్నారు రేవంత్.
దమ్ముంటే పువ్వాడే సీబీఐ విచారణ కోరాలని రేవంత్ డిమాండ్ చేశారు. మరోవైపు పువ్వాడను కులం నుంచి బహిష్కరించాలని కమ్మ పెద్దలను కోరారు రేవంత్. కేసీఆర్ (kcr) జీతగాళ్లలాగా పనిచేస్తూ .. కాంగ్రెస్ (congress) కార్యకర్తలను వేధిస్తున్న అధికారుల పేర్లను డైరీలో నమోదు చేస్తున్నామని.. వారందరికీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. ఒకవేళ అధికారులు రిటైర్ అయిపోయినా మిమ్మల్ని పట్టుకొచ్చి.. శిక్ష విధిస్తామని రేవంత్ అన్నారు. కేసీఆర్ అంతానికి.. పువ్వాడ పతనానికి సమయం దగ్గరపడిందని ఆయన జోస్యం చెప్పారు.
కాగా... ఖమ్మంలో (khammam) బీజేపీ కార్యకర్త సాయి గణేష్ (sai ganesh) .. పోలీస్ స్టేషన్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే తర్వాత హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎస్ (trs) నాయకుడు, కార్పొరేటర్ భర్త ప్రసన్న కృష్ణ కారణమని బీజేపీ (bjp) నాయకులు ఆరోపిస్తున్నారు. సాయి గణేష్ మరణ వాంగ్మూలం ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పువ్వాడ, ప్రసన్న కృష్ణ, త్రీ టౌన్ సీఐ వేధింపులు తట్టుకోలేకే సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. వారిపై చర్యలు తీసుకోవాలని అతని అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మరోవైపు ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (kcr) లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి పువ్వాడను బర్తరఫ్ చేసి.. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షా.. సాయి గణేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. అంతేకాకుండా భదాద్రి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరపాలని రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ ముఖ్యులు కూడా సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించి.. మంత్రి పువ్వాడపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇకపోతే.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై (puvvada ajay kumar) గురువారం జాతీయ మానవ హక్కుల కమీషన్‌కు (national human rights commission) ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ (congress party) . పోలీసులు అండతో విపక్షాలు కార్యకర్తలను వేధిస్తున్నారని ఏఐసీసీ (aicc) సభ్యుడు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు ముస్తఫా, నరేందర్‌పై అక్రమ కేసులు పెట్టారని.. 16 కేసులు, రౌడీషీట్ పెట్టడంతోనే సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో తెలిపారు. చనిపోయేముందు సాయిగణేశ్ ఈ విషయం మీడియాతో చెప్పాడని వివరించారు. సమగ్ర విచారణ జరిపి పువ్వాడపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు ఏఐసీసీ సభ్యుడు. అంతేకాదు సాయి గణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
