మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు మంగళవారం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే కిలో బంగారాన్ని కూడా అందజేశారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సతీసమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం కిలో బంగారాన్ని, పట్టు వస్త్రాలను యదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో ఆలయ ఈఓకు మంత్రి దంపతులు అందజేశారు.
అంతకు ముందు మేళతాళాలు, పూర్ణకుంభంతో ఆలయ అధికారులు, అర్చకులు మంత్రి అజయ్ కుమార్ కు స్వాగతం పలికారు. యాదాద్రి ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా గర్భాలయ విమాన గోపురానికి అద్భుతమైన స్వర్ణ తాపడం చేయించాలనే సూచనల మేరకు కిలో బంగారాన్ని మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంత్రి దంపతులను ఆలయ అధికారులు, అర్చకులు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
