హైదరాబాద్: గోపన్‌పల్లి భూ వివాదంలో  ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని  తెలంగాణ  రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి  స్పష్టం చేశారు. ఈ భూములను అక్రమించినవారిలో ఎంత పెద్దవారున్నా కూడ వదలిపెట్టమని ఆయన తేల్చి చెప్పారు.

గురువారం నాడు తెలంగాణ శాసనమండలి సమావేశంలో  ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. 

గోపన్‌పల్లి భూముల ఆక్రమణ విషయమై సభ్యుడు వేసిన ప్రశ్నలకు మంత్రి సమాధానమచ్చారు.  ఈ విషయమై త్వరలోనే ప్రభుత్వం స్పందించనున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్టుగా  ప్రశాంత్ రెడ్డి చెప్పారు.  ఈ భూముల ఆక్రమణలో ఎంత పెద్ద వారున్నా కూడ పట్టించుకోబోమన్నారు మంత్రి.

ఇక రంగారెడ్డి జిల్లాలోని గందంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని మంత్రి మండలిలో ప్రకటించారు. ఈ భూముల్లో ఇప్పటికే 65 నిర్మాణాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ స్థలంలో ఇళ్లను నిర్మించుకొన్న వారికి 2019 ఆగష్టు 21వ తేదీన నోటీసులు ఇచ్చినట్టుగా చెప్పారు.అంతేకాదు అక్రమ నిర్మాణాలకు అదే ఏడాది ఆగష్టు 29వ తేదీన తాళాలు వేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

ఈ విషయమై చింతల ఎట్టయ్య అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడన్నారు మంత్రి. ఇళ్లకు తాళాలు వేయకూడదని  భవిష్యత్తులో నిర్మాణాలు చేయకుండా చూడాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

అంతేకాదు హైకోర్టు సూచన మేరకు  సర్వే నిర్వహించి రిపోర్టును హైకోర్టుకు అందించినట్టుగా మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు.