వరద బాధితులకు కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని ఆరోపించారు మంత్రి నిరంజన్‌రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముంబై, బెంగళూరులో వరదలు వస్తే రూపాయి సాయం చేశారా? అని ఆయన ప్రశ్నించారు.

వరద బాధితులను కేసీఆర్ సర్కార్‌ ఆదుకుంటే బీజేపీ ఆరోపణలు చేస్తోందని... హైదరాబాద్‌లో మేం సాయం చేస్తే అడ్డుకుంటారా అంటూ నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. జనం లేని సేన జనసేన.. సైన్యం లేని నాయకుడు పవన్ అంటూ మంత్రి సెటైర్లు వేశారు.

తెలంగాణ వ్యతిరేకులు ఒక్కటవుతున్నారని, ఎంతమంది కలిసినా ప్రజలు టీఆర్‌ఎస్‌నే ఆదరిస్తారని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

అంతకుముందు టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేకే మీడియాతో మాట్లాడుతూ... కేసీఆరే నిజమైన హిందువు అన్నారు. మనుషులంతా ఒక్కటే అన్నది టీఆర్ఎస్ విధానమని పేర్కొన్నారు.  ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టామని కేశవరావు తెలిపారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 85 సీట్లు బీసీలకే కేటాయించామని.. టిక్కెట్ల కేటాయింపులో అన్ని వర్గాల వారికి న్యాయం చేశామని కేకే చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని కేశవరావు వెల్లడించారు.