టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ కోసం వచ్చేవారికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను చేసినట్టుగా మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీనే కీలక పాత్ర పోషించందన్నారు. 

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపు హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ జరగనున్న నేపథ్యంలో.. నేడు ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పార్టీ ప్లీనరీ కోసం వచ్చేవారికి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను చేసినట్టుగా వివరించారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీనే కీలక పాత్ర పోషించందన్నారు. తెలంగాణ వ్యతిరేకులు ఆది నుంచి అడ్డుపడుతున్నారని, కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణతో పోలిస్తే ఏ రాష్ట్రం కూడా అభివృద్దిలో, సంక్షేమంలో దరిదాపున లేదని అన్నారు. 


దేశ ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజ‌రాత్ ఏర్ప‌డి 62 ఏళ్లు గడిచన క‌రెంట్ క‌ష్టాలున్నాయని అన్నారు. ఎనిమిదేళ్లలోనే తెలంగాణ‌లో 24 గంట‌ల విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమం మీద అత్య‌ధికంగా ఖ‌ర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మే అని తెలిపారు. తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాలు దేశంలో ఎక్క‌డా లేవ‌ని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి సమక్షేమ పథకాలు లేవని చెప్పారు. బీజేపీ నినాదాలు ఇవ్వడంలో మాత్రమే ఫస్ట్ ఉంటుందని నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ గాలి మాటలు చెప్పే పార్టీ కాదని స్పష్టం చేశారు. 

తెలంగాణ ఏడేళ్ల సగటు వృద్ది రేటు 11.7 శాతంగా ఉంద‌న్నారు. దేశ స‌గ‌టు ఆర్థిక వృద్ధిరేటు 6 శాత‌మే అని తెలిపారు. తెలంగాణ జీఎస్‌డీపీలో వ్య‌వ‌సాయ రంగందే 21 శాతం అని పేర్కొన్నారు. ఎవరి ఆర్ధిక వృద్ది ఎక్కువగా ఉందో ప్రజలు గమనించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కనపడని వాళ్ళు యాత్రల పేరిట తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీస్తోన్న తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉన్నావాళ్లను, వ్య‌తిరేకుల‌ను స‌రైన స‌మ‌యంలో నేల‌కేసి కొడుతామ‌ని అన్నారు.