అక్రమాలు నిరూపిస్తే రాజీనామా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తనపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ చేశారు. 

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రాష్ట్ర రాజకీయాలు బీజేపీ వర్సస్ బీఆర్ఎస్ గా మారిపోయాయి. ఢిల్లీ లికర్ మాఫియాలో కవితపై ఈడీ విచారణ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ లీకేజీ, పదోతరగతి ప్రశ్నాపత్రం వైరల్ వంటి ఘటనలతో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సంచలన ఆరోపణలు చేయడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు తనపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని 
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ చేశారు. 

అసలేం జరిగింది ? 

ప్రభుత్వ భూములను ఆక్రమించారని, కృష్ణానది పరీవాహక ప్రాంతాన్ని కబ్జా చేసి ఫాంహౌస్‌ నిర్మించుకున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. నదిలోనే కాంపౌండ్‌ వాల్‌ నిర్మించారని, మంత్రి కబ్జ చేసిన భూములకు గిరిజనుల పేరిట రూ. కోట్ల సబ్సిడీలు పొందారని అన్నారు. ఆ అనంతరం ఆ భూములను తన కుటుంబసభ్యులకు బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాకు గురైన భూముల ఫొటోలను మీడియాకు అందించారు. 

వనపర్తి జిల్లా మానవపాడులోని చండూరు గ్రామాల పరిధిలో కృష్ణానది ప్రాంతంలో మంత్రి నిరంజన్‌రెడ్డి 80 ఎకరాల భూమిని అక్రమంగా తమ వర్గీయుల పేరు మీదుగా రిజిస్టర్‌ చేసుకున్నారని తెలిపారు. అక్కడ ఫాంహౌస్ కూడా నిర్మించుకున్నారని ఉందన్నారు. మూడున్నర ఎకరాల్లో సీసీ రోడ్లు కూడా వేశారని తెలిపారు. అంతేకాకుండా.. గిరిజనుల పేరిట సుమారు రూ.7 కోట్ల వ్యవసాయ, ఉద్యానవన సబ్సిడీలను పొందారని, ఆ తర్వాత ఆ భూములను మంత్రి కుటుంబసభ్యుల పేరిట బదిలీ చేయించుకున్నారని వివరించారు. ఈ భూమి చుట్టూ కాంపౌండ్‌వాల్‌ నిర్మించారన్నాని ఆరోపించారు. ఈ విషయంలో మానవపాడు మండల రెనెన్యూ అధికారులు కూడా సరైన సమాధానం ఇవ్వడం లేదని, రెండేళ్ల కిందట తమ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగి, రికార్డులన్నీ కాలిపోయాయని, ఆ రికార్డు కూడా కాలిపోయాయని చెప్పడం చిత్రంగా ఉందని అన్నారు. అయితే.. ఈ మేరకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశామని చెపుతున్నారు . కానీ.. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా.. ఇప్పటివరకూ చార్జిషీట్‌ దాఖలు చేసినట్టు ఆధారాలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అలాగే మంత్రి నిరంజన్‌రెడ్డి తన ఫాంహౌ‌స్ కు బీటీ రోడ్డు కోసం ఎస్టీ కోటా నిధులు కేటాయించారని రఘునందన్‌ విమర్శించారు. నిరంజన్‌రెడ్డికి కుటుంబ వారసత్వంగా (పానగల్‌ గ్రామం) 16 ఎకరాల భూమి మాత్రమే వచ్చిందనీ, కానీ నేడు ఆయన వంద ఎకరాల్లో ఫాంహౌస్‌, కోట్ల రూపాయలతో ప్యాలెస్‌ నిర్మించారని పేర్కొన్నారు.వాటికి సంబంధించిన అన్ని ఆధారాలూ సేకరిస్తున్నట్లు చెప్పారు. ఏ మంత్రికి ఎన్ని ఫాంహౌస్ లు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ ఎమ్మెల్యే 
డిమాండ్‌ చేశారు.

ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తా.. 

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు తనపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తే.. పదవికి రాజీనామా చేస్తానని మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ చేశారు. ఒకవేళ ఆరోపణలను రుజువు చేయలేకపోతే.. ఆయన క్షమాపణ చెప్పి, తన పదవికి రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘునందన్‌రావు ఆరోపించినట్టు తనకు మూడు మూడు ఫాం హౌస్ లు ఉన్నట్లు అయితే.. వాటిపై ఆయనకు నచ్చినవాళ్లతో సర్వే చేయించుకోవచ్చునని, తాను కొనుగోలు చేసిన భూమి కన్నా ఒక గుంట ఎకువ ఉన్నా.. ఆ భూములని విడిచి పెడుతానని అన్నారు. రాజకీయ దుర్బుద్ధితోనే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనపై, తన పిల్లలపై ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. తనకు పాన్‌గల్‌లో ఉన్న భూముల వివరాలను 2014, 2018 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నానని, అవి ఇప్పుడు కొత్తగా వచ్చినవేమీ కావని స్పష్టం చేశారు. తన ఫాంహౌస్ ను తన భార్య సొంత డబ్బులు, బ్యాంకు లోన్‌ తీసుకొని నిర్మించుకున్నామని పేర్కొన్నారు.

తనకు మూడు ఫాం హౌసులు ఉన్నాయనడం అవివేకమని, పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాం హౌసులని అంటారా? అని నిలదీశారు. రఘునందన్‌ వచ్చి తన భూములను సర్వే చేయవచ్చని,కొనుగోలు చేసిన భూమి కంటే ఒక్క గుంట ఎక్కువ ఉన్నా .. వదిలేస్తారని, తాను పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. తనపై చేసిన ఆరోపణలకు రఘునందన్‌రావు క్షమాపణ చెప్పాలని మంత్రి పేర్కొన్నారు.