తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అభిమానం చాటుకున్నారు మంత్రి మల్లారెడ్డి. ఆయన దేశానికి ఒకసారి ప్రధాని కావాలి అంటూ వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ప్రజలకు సమస్యలే ఉండవని చెప్పుకొచ్చారు.

జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న వారు చిన్నప్పటి నుంచి అవే పథకాలు అమలు చేస్తున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు. ఏదో మభ్యపెట్టి కాలం గడుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. 70 ఏళ్లపాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని మల్లారెడ్డి ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ ఏడు సంవత్సరాలలోనే చరిత్ర సృష్టించారని ఆయన ప్రశంసించారు. రాష్రంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందించిన వ్యక్తి కేసీఆర్ అని మంత్రి కొనియాడారు. సాగునీరు, త్రాగునీరు, ఫించన్లు అర్హులైన అందరికీ అంజేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.

దేశం చూపు తెలంగాణ వైపు ఉందని.. అందుకే కేసీఆర్‌ను పీఎం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఒక్కసారి పీఎం అయితే.. అన్ని రాష్ట్రాల్లో ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని మల్లారెడ్డి పేర్కొన్నారు.  

చివర్లో తన ప్రసంగం ముగిస్తూ తన శాఖ పద్దు చాలా చిన్నదని.. సభ్యులందరూ సహకరించి పద్దును ఆమోదించాలని కోరడంతో సభ్యులంతా నవ్వులు చిందించారు.