Asianet News TeluguAsianet News Telugu

టీడీపీలో వున్నప్పటి నుంచి బ్లాక్‌మెయిలింగ్.. బాబుతో కూడా చెప్పా: రేవంత్‌పై మల్లారెడ్డి ఆరోపణలు

అబద్ధాలతో తన ప్రతిష్టను డ్యామేజ్ చేయాలని చూశారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్  రెడ్డిపై మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల కోసం తాను ఆసుపత్రి కడితే ప్రభుత్వ భూమి కబ్జా చేశానని ఆరోపించాడని మండిపడ్డారు. బట్టకాల్చి పెద్ద మనుషుల మీద వేయడమే రేవంత్ రెడ్డి పనా అంటూ మల్లారెడ్డి ధ్వజమెత్తారు. 
 

minister malla reddy slams tpcc chief revanth reddy
Author
Hyderabad, First Published Aug 28, 2021, 2:39 PM IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మరోసారి మండిపడ్డారు మంత్రి మల్లారెడ్డి. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన  ఆయన.. ఏవో కొన్ని జిరాక్స్ పేపర్లు తీసుకొచ్చి.. నేను కబ్జాలు చేసినట్లు రేవంత్ అబద్ధాలు చెప్పారంటూ ఆరోపించారు. తన సవాల్‌ను రేవంత్ రెడ్డి స్వీకరించలేదని.. అబద్ధాలతో తన ప్రతిష్టను డ్యామేజ్ చేయాలని చూశారంటూ మల్లారెడ్డి ఎద్దేవా  చేశారు. పేద ప్రజల కోసం తాను ఆసుపత్రి కడితే ప్రభుత్వ భూమి కబ్జా చేశానని ఆరోపించాడని మండిపడ్డారు.

బట్టకాల్చి పెద్ద మనుషుల మీద వేయడమే రేవంత్ రెడ్డి పనా అంటూ మల్లారెడ్డి ధ్వజమెత్తారు. అందుకోసమే పీసీసీ చీఫ్ పదవిని ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎంపీ అయినప్పటి నుంచి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని మల్లారెడ్డి  ఆరోపించారు. నా కాలేజీలన్నీ  మూయిస్తానని ఛాలెంజ్ చేశాడని.. తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని అప్పట్లో చంద్రబాబుకు కూడా చెప్పానని మంత్రి తెలిపారు.

Also Read:ఇది మల్లారెడ్డి అవినీతి చిట్టా... సర్వే నెంబర్లతో సహా బయటపెట్టిన రేవంత్ రెడ్డి

ఇటీవల పార్లమెంట్‌లో కూడా తన కాలేజీల గురించి ప్రశ్న వేశాడని మల్లారెడ్డి వెల్లడించారు. తన కాలేజీలకు సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగలేదని కేంద్రం స్పష్టంగా చెప్పిందని మల్లారెడ్డి  పేర్కొన్నారు. సీఎంఆర్ కాలేజీలలో చదువుకున్న వారు నేడు ప్రపంచవ్యాప్తంగా  ఉన్నత స్థానాల్లో వున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు. తనకు అది చాలని ఆయన చెప్పారు. తాను అమాయకుడినని, అందరికీ టైం వస్తుందని  మల్లారెడ్డి స్పష్టం  చేశారు. తన కోడలి పేరు మీద 350 గజాల స్థలం వుందని.. ట్యాక్స్ కడుతున్నామన్నారు. దానికి ఎన్‌వోసీ, సేల్ డీడ్ వుందని మంత్రి చెప్పారు. తమకు రెండు మెడికల్ కాలేజీలు వున్నాయని.. గతేడాది సెప్టెంబర్ 9న హాస్పిటల్ ప్రారంభించామని మల్లారెడ్డి గుర్తుచేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios