ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై తెలంగాణలో బీజేపీ , బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌కి మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి సవాల్ విసిరారు మంత్రి మల్లారెడ్డి. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్న ఆయన.. మరో రాష్ట్రంలో తెలంగాణ తరహా అభివృద్ధి పథకాలను చూపిస్తే తాను మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. బండి సంజయ్ తనని ఎక్కడికి రమ్మంటే అక్కడి వస్తానని మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులకు న్యాయం జరగలేదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ రైతును రాజును చేశారని మల్లారెడ్డి ప్రశంసించారు. బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిని వదిలిపెట్టి.. రైతుల కోసం ఖర్చు చేసిన పైసల్ని ఇవ్వమంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా... ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కల్లాల నిర్మాణాన్ని కావాలనే రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడే కల్లాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన సహాయాన్ని ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ కేంద్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శించారు. రైతులకు ఉపయోగం కోసం కల్లాలు నిర్మిస్తే ఆ నిధులు వెనక్కి ఇవ్వమని అడగడమేమిటని అన్నారు. ఇదేనా కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు.
ALso REad: రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నాలు.. కేంద్రం తీరుకు నిరసనగా నేతల పిలుపు..
రాష్ట్ర ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతుల ప్రయోజనాల కోసం కల్లాలు నిర్మించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. మంచి పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడానికి బదులు.. ప్రతిష్టను దిగజార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు.
మరోవైపు కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం కల్లాలు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తుంటే, కేంద్రం అది తప్పని అంటుందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం చేపల కోసం కల్లాలు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చిందని.. అలాంటప్పుడు పంటలకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రేపు అన్ని జిల్లాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.
