Asianet News TeluguAsianet News Telugu

కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఐటీ దాడులు ఉండవు : మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

MInister Malla reddy Sensational comments On IT Raids
Author
First Published Nov 27, 2022, 5:21 PM IST

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. 2024లో కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి ఆదివారం సిద్దిపేట జిల్లా ములుగు బహిలంపూర్‌లో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన  మాట్లాడుతూ.. కేసీఆర్ ఒక మహాత్ముడని, గొప్ప వ్యక్తి అని అన్నారు. అంబేడ్కర్ తర్వాత పేద ప్రజలకు మంచి చేసింది ఎవరైన ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. 

ఐటీ దాడులకు భయపడేది లేదని.. తన వెంట సీఎం కేసీఆర్ ఉన్నారని చెప్పారు. కేసీఆర్ తన వెంట ఉన్నంతవరకూ ఏ రైడ్‌లకు భయపడనని చెప్పారు. 2024లో ఢిల్లీలోని ఎర్రకోట మీద కేసీఆర్ జెండా ఎగరవేస్తారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశం మొత్తం ఇన్‌కమ్ ట్యాక్స్ రియలైజ్ చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వం వస్తే ఐటీ దాడులు చేయడం ఉండదన్నారు. ప్రతి ఒక్కరు ఎంతైనా సంపాదించుకోవచ్చని అన్నారు. ఎవరికి వారే స్వచ్చందంగా ట్యాక్స్ చెల్లించేలా కేసీఆర్ రూల్స్ తీసుకోస్తారని అన్నారు. 

ఇక, ఇటీవల రెండు రోజుల పాటు మల్లారెడ్డి ఇంటితో పాటు, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లు, విద్యాసంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈ ఐటీ దాడులు అధికారులు పలువురి ఇళ్ల నుంచి కొంత నగదును కూడా సీజ్ చేశారు. అయితే ఐటీ రైడ్స్ ముగిసే సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, ఐటీ అధికారులు పరస్పరం ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌ నుంచి కొన్ని పత్రాలపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారంటూ ఐటీ అధికారి రత్నాకర్‌పై మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి గురువారం తెల్లవారుజామున పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ఐటీ అధికారి రత్నాకర్‌ బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెండు కేసులను జీరో ఎఫ్‌ఐఆర్‌లుగా నమోదు చేసి దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వచ్చినందున కేసును బదిలీ చేసినట్టుగా బోయిన్‌పల్లి పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios