పార్టీ మారాలనే ఐటీ దాడులు: మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి
పార్టీ మారాలనే ఐటీ దాడులు చేశారని అనుకుంటున్నానని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఢిల్లీ పెద్దల ఆదేశం మేరకు ఐటీ సోదాలు జరిగాయన్నారు.
హైదరాబాద్:ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకు తమ నవాసాల్ో ఐటీ దాడులు జరిగాయని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రిరాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. పార్టీ మారాలనే ఇదంతా చేస్తున్నారని తాను అనుకుంటున్నానని మర్రి రాజశేఖర్ రెడ్డి చెప్పారు. హైద్రాబాద్ లోని తన నివాసంలో గురువారంనాడు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఉదయాన్నే ఆయన టర్కీ నుండి హైద్రాబాద్ కు చేరుకున్నారు.రాజకీయ కక్షతోనే ఐటీ సోదాలు నిర్వహించారన్నారు. తన నివాసంలో రూ. 4 కోట్లు సీజ్ చేశారన్నారు. కాలేజీల్లో వేతనాలకు నెలకు కనీసం కోటి రూపాయాలకుపైగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఐటీ సోదాలకు తాము సహకరిస్తామన్నారు. తాముమ చట్టప్రకారంగా ట్యాక్సులు చెల్లిస్తామని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. తాను ఇంట్లో లేని సమయంలో ఐటీ అధికారులు తన కుటుంబసభ్యుల పట్ల వ్యవహరించిన తీరుపై చట్టపరంగా చర్యలు తీసుకొంటానని చెప్పారు. తన తండ్రి, తల్లి, కూతురితోపాటు ఇతరుల ఫోన్లను కూడా ఐటీ అధికారులు సీజ్ చేశారన్నారు.
also read:బీజేపీ కుట్రలకు భయడపడం, కేసీఆరే మా ధైర్యం: మంత్రి మల్లారెడ్డి
తనకు ఐటీ అధికారులు ఫోన్లు చేయలేదని రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఐటీ అధికారుల తీరుతో తన కూతురు ఇబ్బందిపడిందన్నారు. తన ఇంట్లో ఏమేం సీజ్ చేశారనే విషయమై ఇంకా తనకు తెలియదన్నారు. మీడియా ద్వారానే తనకు ఐటీ దాడుల విషయం తెలిసిందని మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. తన కుటుంబసభ్యులతో మాట్లాడాల్సి ఉందన్నారు.విహారయాత్రకు టర్కీ వెళ్లిన మర్రి రాజశేఖర్ రెడ్డి ఇవాళ ఉదయాన్నే హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి మర్రి రాజశేఖర్ రెడ్డి నేరుగా తన నివాసానికి వెళ్లారు. తన కూతురు, కుటుంబసభ్యులతో రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో ఐటీ అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహించారు.ఇవాళ ఉదయం ఐటీ సోదాలు ముగిశాయి.