బీజేపీ నేతలను హెచ్చరించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. మీరు హింసను కోరుకుని, రెచ్చగొడితే తాము కూడా యుద్ధానికి సిద్ధమని కేటీఆర్ హెచ్చరించారు. 

మునుగోడులో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్నటి ఘటనలో గాయపడిన ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్‌ను మంత్రి బుధవారం పరామర్శించి, మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో ఎనిమిదేళ్ల నుంచి శాంతియుత వాతావరణం వుందన్నారు. మీరు హింసను కోరుకుని, రెచ్చగొడితే తాము కూడా యుద్ధానికి సిద్ధమని కేటీఆర్ హెచ్చరించారు. హింసను తిప్పికొట్టే శక్తి, సత్తా మాకు వుందని ఆయన స్పష్టం చేశారు. దీని వల్ల సామాన్యులు నలిగిపోతున్నారని.. భౌతికదాడులు సరికాదని మంత్రి హితవు పలికారు. 

చిల్లర పనుల్ని , ప్రచారాన్ని బంద్ చేయాలని.. మునుగోడులో ఓటమి తప్పదని తెలిసే అమిత్ షా, జేపీ నడ్డాలు మీటింగ్ రద్దు చేసుకున్నారని కేటీఆర్ సెటైర్లు వేశారు. బెంగాల్‌లో బీజేపీ వల్లే హింస ప్రారంభమైందని.. శవాల మీద పేలాలు ఏరుకునే సంస్కృతి ఆ పార్టీదని మంత్రి దుయ్యబట్టారు. నిన్నటి ఘటనలో 12 మంది టీఆర్ఎస్ నేతలు గాయపడ్డారని.. సానుభూతి రాజకీయాలు మంచిది కాదని కేటీఆర్ హెచ్చరించారు. ఒక్క చుక్క రక్తం చిందకుండా 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపామని మంత్రి గుర్తుచేశారు. 

తెలంగాణ వచ్చాక జరిగిన ఏ ఉపఎన్నికలోనూ ఉద్రిక్తతకు చోటివ్వలేదని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఒక ప్రణాళిక ప్రకారం బీజేపీ నేతలు హింసను రెచ్చగొడుతున్నారని మంత్రి ఆరోపించారు. నిన్నటి ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వున్నాయని.. ఎవరు ఎవరి మీద దాడి చేశారనే దానిపై స్పష్టత వుందని కేటీఆర్ పేర్కొన్నారు. తమకు 60 లక్షల మంది కార్యకర్తలు వున్నారని.. రెచ్చగొడితే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. 

అంతకుముందు మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతలపై బీజేపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని ఆరోపించారు ద్విచక్ర వాహనాలపై కూర్చొని వున్న టీఆర్ఎస్ శ్రేణులపై రాళ్లతో దాడి చేశారన్నారు. దాడి విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నారని మంత్రి చెప్పారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి కూడా హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకున్నారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి పలివెలలో రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆయన ఆరోపించారు. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులు, టీఆర్ఎస్ నేతలపైనా దాడి చేశారని జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అంతా వుందని.. ఎవరు, ఎవరిపై దాడి చేశారన్నది తమ దగ్గర ఆధారాలు వున్నాయని మంత్రి తెలిపారు.