Asianet News TeluguAsianet News Telugu

నవంబర్‌లో అందరికి ల్యాప్ టాప్‌లు ఇవ్వడానికి మళ్లీ వస్తాను.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి కేటీఆర్

హాస్టల్ కష్టాలు తనకు తెలుసునని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. పాతుకుపోయిన వ్యవస్థలను మార్చడానికి టైమ్ పడుతుందని అన్నారు. ప్రక్షాళన చేసేందుకు విద్యార్థులు కూడా తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. 

minister ktr visited basara iiit and interact with students
Author
First Published Sep 26, 2022, 5:27 PM IST

బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను ఒక్కోక్కటిగా పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని విద్యార్థులను కోరారు. సోమవారం రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లు బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. హాల్‌లో నేలపై కుర్చొనే విద్యార్థులతో ఫొటోలు దిగారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హాల్‌లో విద్యార్థులు కింద కూర్చొవడం తనకు నచ్చలేదని అన్నారు. ఆడిటోరియంలో ఫిక్స్‌డ్ చైర్‌లు మాదిరిగా హాల్‌లో చైర్‌లను ఏర్పాటు చేయాలని వీసీకి  సూచించారు. ఇందుకోసం అవసరమయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పారు. మళ్లీ వచ్చేనాటికి హాల్‌లో అందరూ పైన కూర్చొనేలా చూడాలని వీసీని కోరారు. 

తాను విద్యార్థిగా ఉన్న సమయంలో 70 శాతం జీవితం హాస్టల్స్‌లోనే గడిచిందన్నారు. హాస్టల్ కష్టాలు తనకు కూడా తెలుసని.. పాతుకుపోయిన వ్యవస్థలను మార్చడానికి టైమ్ పడుతుందని అన్నారు. ప్రక్షాళన చేసేందుకు విద్యార్థులు కూడా తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. రెండు నెలల తర్వాత అంటే నవంబర్ తాను మళ్లీ వస్తానని.. అందరికీ ల్యాప్ ట్యాప్‌లు ఇస్తానని చెప్పారు. 

శాంతియుతంగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన పోరాటం తనకు కూడా నచ్చిందని.. అయితే ప్రభుత్వంలో ఉన్న తాను ఈ మాట చెప్పకూడదని అన్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లడమే తప్ప.. వేరే ఏజెండా లేకుండా ఉద్యమం నడిపిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు.  

మెస్‌లలో నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కట్టడం తేలికైన పని అని.. అయితే మెయింటనెన్స్ అనేది  చాలా పెద్ద చాలెంజ్ అని అన్నారు.  విద్యార్థులు కూడా ట్రిపుల్ ఐటీని వారి సొంత ఆస్తిగా భావించాలన్నారు. ప్రతి వస్తువును జాగ్రత్తగా కాపాడుకుని.. తర్వాత వచ్చే విద్యార్థులకు అందించాలని కోరారు. విద్యార్థుల నుంచి కొత్త ఆవిష్కరణలు రావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం చూడకుండా.. ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని అన్నారు. 

బాసర ట్రిపుల్ ఐటీలో ప్రతి ఏడాది  ఇన్నోవేషన్ వారోత్సవాలు జరగాలని అన్నారు. క్రీడల కోసం రూ. 3 కోట్లతో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆరు నుంచి ఎనిమిది నెలల్లో మినిస్టేడియం పూర్తి చేస్తామని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios