Asianet News TeluguAsianet News Telugu

ఫ్లోరైడ్ బాధితుడు స్వామి ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్... అండగా వుంటానని భరోసా

ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంట్లో మంత్రి కేటీఆర్ భోజనం చేశారు. సందర్భంగా స్వామి తల్లిదండ్రులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5.50 లక్షలు మంజూరు చేయించారు కేటీఆర్

minister ktr visited amshala swamy home in munugode
Author
First Published Oct 13, 2022, 6:45 PM IST

మునుగోడు ఉపఎన్నికల ప్రచారం నిమిత్తం అక్కడికి వెళ్లిన తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గురువారం శివన్న గూడెంలోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కేటీఆర్ .. స్వామి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా స్వామి తల్లిదండ్రులతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం స్వామి ఇంట్లోనే కేటీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు భోజనం చేశారు. స్వామి కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా వుంటానన్న కేటీఆర్.. ఆర్ధిక సహాయం అందించారు. దీనితో పాటు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5.50 లక్షలు మంజూరు చేయించారు కేటీఆర్. అలాగే ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిందిగా కర్నాటి విద్యాసాగర్‌ రావును ఆదేశించారు కేటీఆర్. 

 

minister ktr visited amshala swamy home in munugode

 

కాగా... మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా చండూరులో గురువారం నాడు నిర్వహించిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. ప్రతి మూడు నెలలకు ఓసారి మునుగోడులో ప్రతి అభివృద్ది కార్యక్రమాన్ని తానే స్వయంగా పరిశీలించనున్నట్టుగా కేటీఆర్ తెలిపారు. సూర్యాపేటను మంత్రి జగదీష్ రెడ్డి, సిరిసిల్లను తాను ఎలా చూసుకొంటున్నామో మునుగోడును కూడా తామిద్దరం కలిసి  అభివృద్దిలో ముందుకు నడిపిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

 

minister ktr visited amshala swamy home in munugode

 

మునుగోడు ఆత్మగౌరవానికి, డబ్బు మదం ఉన్న కాంట్రాక్టర్ కు మధ్యేపోటీగా ఉప ఎన్నికను ఆయన పోల్చారు. ఒక్కో ఓటును డబ్బు పెట్టి కొంటానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నాడన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. మునుగోడు ఉపఎన్నిక ప్రజలపై బలవంతంగా రాజగోపాల్ రెడ్డి  రుద్దారని ఆయన ఆరోపించారు. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. దేవుళ్లను కూడా తమ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పాకిస్తాన్, హిందూస్తాన్ తప్ప పనికొచ్చే ముచ్చట్లు మోడీ చెప్పరన్నారు.  తిరుమలకు ధీటుగా యాదాద్రి ఆలయాన్ని అభివృద్ది చేసినట్టుగా కేటీఆర్ గుర్తు చేశారు  యాదాద్రి ఆలయానికి మోడీ సర్కార్ ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ కంటే మోడీ పెద్ద హిందువా అని ఆయన ప్రశ్నించారు. 

 

minister ktr visited amshala swamy home in munugode

 

ఎన్నికల ముందు విదేశీ బ్యాంకుల్లోని నల్ల ధనాన్ని తెచ్చి ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తామని ఇచ్చిన  హామీ ఏమైందని ఆయన మోడీని ప్రశ్నించారు. మోడీ రూ. 15 లక్షలు ఇస్తే బీజేపీకి ఓటేయాలన్నారు. లేకపోతే తమ పార్టీకి ఓటేయాలని కేటీఆర్ కోరారు. ధనవంతులకు  దేశసంపదను ప్రధాని నరేంద్ర మోడీ దోచిపెడుతున్నాడని కేటీఆర్ విమర్శించారు. ఇందులో భాగంగానే మోడీ ప్రభుత్వం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆస్తులను పెంచారన్నారు. రూ.18 వేల కోట్లతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆయన అన్నను  బీజేపీ కొనుగోలు చేసిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాజగోపాల్ రెడ్డికి చెందిన చిన్న కంపెనీకి రూ. 18 వేల కోట్ల పెద్ద కాంట్రాక్టు ఎలా వచ్చిందో చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios