తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఐపీ బడ్డీ మస్కట్ రచిత్ ను ఆవిష్కరించింది. రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లా రెడ్డి సమక్షంలో మంత్రి కేటీఆర్ ఈ మస్కట్‌ను ఆవిష్కరించారు. విద్యార్థులు, ఇతర ఆసక్తిదారుల్లో మేధోపరమైన హక్కులు, సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన విషయాలపై ఐపీ బడీ అవగాహన పెంచనుంది.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమం ఐపీ బడ్డీ(Telangana IP Buddy)పై అవగాహన కల్పించడానికి మస్కట్‌(Mascot Rachit)ను ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్(Minister KTR) ఈ మాస్కట్ బడ్డీ రచిత్ ను బుధవారం ఆవిష్కరించారు. ప్రభుత్వ కార్యక్రమమైన తెలంగాణ మస్కట్‌ను రిజల్యూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రిజల్యూట్ ఫర్ ఐపీ సమర్పించింది. మేధోపరమైన హక్కు(ఐపీఆర్)లపై అవగాహన, సమస్యలకు పరిష్కారాలు, దీని చుట్టూ ఉండే ఇతర అంశాలను అందరికీ అందుబాటులోకి తేవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతున్నది. డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణలో క్యాబినెట్ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్ర రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లా రెడ్డిల సమక్షంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ మస్కట్‌ను ఆవిష్కరించారు. ఇదే కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, కూడా ఉన్నారు. రిజల్యూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రమీందర్ సింగ్ సోయిన్, డీపీఎస్ చైర్మన్ ఎం కొంరయ్య, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డిలు డీపీఎస్ పీఆర్వో నోయెల్ రాబిన్‌సన్ కూడా హాజరయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ(ఎప్‌టీసీసీఐ), రాక్‌సాల్ట్‌లు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకోనున్నాయి.

మేధో పరమైన హక్కుల రక్షణ, సృజనాత్మకత, ఆవిష్కరణలపై అవగాహన కల్పించనుంది. తెలంగాణలో ఐపీ సంబంధ సంస్కృతిని పెంపొందించడంలో రచిత్ కీలకంగా వ్యవహరించనుంది. కేంద్ర ప్రభుత్వం గత నెల 8వ తేదీన కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డీపీఐఐటీ నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవేర్‌నెస్ మిషన్‌ను ప్రారంభించింది. స్కూల్స్, కాలేజీలు, ఇతర భాగస్వాములందరిలోనూ ఐపీ అవేర్‌నెస్‌ను కల్పించడమే దీని ప్రాథమిక లక్ష్యం. దేశవ్యాప్తంగా కాలేజీలు, పాఠశాలల్లోని సుమారు పది లక్షల మంది 8వ నుంచి 12వ తరగతి విద్యార్థుల్లో ఐపీపై అవగాహన కల్పించాలనే లక్ష్యాన్ని ఈ కార్యక్రమం నిర్దేశించుకుంది. విద్యార్థులు, స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఆసక్తి ఉన్నవారందరితోనూ ఐపీ బడీ కలిసి పని చేయనుంది. ఆయా కంపెనీలు, సంస్థల్లో అవగాహన పెరిగిన వారిని ఐపీ అంబాసిడర్‌గా గుర్తిస్తుంది. 2023 మార్చి 31వ తేదీలోపు ఇలా పది వేల మంది ఐపీ అంబాసిడర్‌లను సర్టిఫై చేయాలనే టార్గెట్ ఉన్నది. 

Also Read: ఏ ప్రధానిని రోడ్డుపై ఆపలేదు, కేసీఆర్ రైతులకు ఏటీఎంలాంటివాడే: జేపీ నడ్డాపై కేటీఆర్ ఫైర్

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సమ్మిళిత అభివృద్ది జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ఇటీవలే ఓ కార్యక్రమంలో అన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా తెలంగాణ రూపురేఖలు మారుస్తున్నామని పేర్కొన్నారు. ఏడాదిన్నరలో నల్గొండ ఐటీ హబ్‌ను (Nalgonda IT Hub) ప్రారంభించి.. స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని కేటీఆర్ అన్నారు. నల్గొండ ఐటీ హబ్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు తొమ్మిది కంపెనీలు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోగా.. మరో ఏడు కంపెనీలు ఐటీ హబ్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరిచాయని చెప్పారు. శుక్రవారం నల్గొండ జిల్లాలోని పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో ఐటీ హబ్​కు కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. ఎస్సీ, ఎస్టీ హాస్టల్ భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటుగా మంత్రులు జగదీశ్​ రెడ్డి, ప్రశాంత్​ రెడ్డి‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.