Asianet News TeluguAsianet News Telugu

‘పేపర్‌ వేస్తే తప్పేంటి’: వయసేంత... ఆ మాటలేంటీ, చిన్నారి కాన్ఫిడెన్స్‌కి కేటీఆర్ ఫిదా

ఉదయాన్నే పేపర్ వేస్తున్న ఓ చిన్నారి కథను మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. ఈ బాలుడి ఆత్మవిశ్వాసం, ఆలోచనల్లో స్పష్టత, హావభావాలు నాకు చాలా నచ్చాయి అని మంత్రి ప్రశంసించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు చిన్నారి జైని ప్రశంసిస్తున్నారు.
 

minister ktr tweets jagtial child paper boy video goes viral
Author
Jagtial, First Published Sep 23, 2021, 8:22 PM IST

పరిస్ధితులు, ఆర్ధిక ఇబ్బందులు, తల్లిదండ్రులకు ఆసరాగా వుండాలనే ఉద్దేశం కావొచ్చు. కొందరు పిల్లలు చిన్నవయసులోనే కుటుంబ బాధ్యతలు నెత్తికెత్తుకుంటున్నారు. ఎంతోమంది పిల్లలు పాఠశాలలకు హాజరవుతూనే లోకం తెలియని వయసులో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. అచ్చం ఇలాంటి పనే చేస్తున్న ఓ చిన్నారి కథను మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. ఈ చిన్నారి ఆత్మవిశ్వాసం, ఆలోచనల్లో స్పష్టత, హావభావాలు నాకు చాలా నచ్చాయి అని మంత్రి ప్రశంసించారు.

ఈ వీడియోలోని సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న జై ప్రకాశ్‌ అనే బాలుడు ఉదయం పూట పేపర్‌ బాయ్‌గా పని చేస్తున్నారు. ఓ రోజున ఓ వ్యక్తి.. జై ప్రకాశ్‌ని పలకరించాడు. ఏం చేస్తున్నావ్‌.. ఎక్కడ చదువుతున్నావ్‌ అని ప్రశ్నించాడు. అనంతరం సదరు వ్యక్తి ఈ ఏజ్‌లో నువ్వు పేపర్‌ వేస్తున్నావ్‌ ఎందుకు అని ప్రశ్నించగా.. అప్పుడు జై ప్రకాశ్‌ ‘ఏం.. పేపర్‌ వేయొద్దా’ అని బదులిచ్చాడు.

అప్పుడు ఆ వ్యక్తి చిన్నారి జై ప్రకాశ్‌ని ప్రశంసించి.. ‘చదువుకునే ఏజ్‌లో పని చేస్తున్నావ్‌ కదా’ అంటే.. అందుకు జై.. ‘చదువకుంటున్నా.. పని చేస్తున్నా.. దానిలో తప్పేం ఉంది’ అని జవాబిస్తాడు. ఈ ఏజ్‌లో నువ్వు ఇలా కష్టపడటం చాలా నచ్చింది అని సదరు వ్యక్తి అనగా.. ‘కష్టపడితే ఏం అయితది.. భవిష్యత్తులో నాకు మేలు చేస్తుంది’ అని సమాధానం ఇస్తాడు జై. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు చిన్నారి జైని ప్రశంసిస్తున్నారు. పిల్లలు, పెద్దలు నిన్ను చూసి నేర్చుకోవాలని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోని 5 వేల మందికి పైగా లైక్‌ చేయగా.. 900 మందికి పైగా రీట్వీట్‌ చేశారు. మంత్రి కేటీఆర్ పుణ్యమా అని ఒక్కరోజులో జై ప్రకాశ్‌ స్టార్‌ అయ్యాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios