Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ పాక్ లో ఉందా, చైనాలో ఉందా: బండి సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై కేటీఆర్

తమను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించడంపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్‌ నియోజకవర్గం గాంధీనగర్‌లో  రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు

minister ktr slams bjp leaders over surgical strikes remarks ksp
Author
Hyderabad, First Published Nov 24, 2020, 6:57 PM IST

తమను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపిస్తే పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించడంపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్‌ నియోజకవర్గం గాంధీనగర్‌లో  రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ పాతబస్తీ చైనాలో ఉందా, పాకిస్తాన్ లో ఉందా, ఎందుకు సర్జికల్ స్ట్రైక్ చేస్తారని ఆయన నిలదీశారు.

ఈసారి ముషీరాబాద్‌లో బీజేపీ, ఎంఐఎంను కలిపి కొట్టాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. భోలక్‌పూర్‌లో డ్రైనేజీ కలిసిన నీళ్లు తాగి 9 మంది చనిపోయిన ఘటన మరిచిపోలేదని ఆయన గుర్తుచేశారు.

వందేళ్ల క్రితం గండిపేట తప్ప  హైదరాబాద్‌కు రిజర్వాయర్‌ లేదన్నారు. ఐదేళ్ల కిందట మా విజ్ఞప్తిని మన్నించి 99 సీట్లతో ఆశీర్వదించామని.. మీరు ఓటేసినందుకు ఏమేం చేశామో చెప్పాల్సిన బాధ్యత  మాపై ఉందన్నారు.

ఆర్టీసీ  క్రాస్‌ రోడ్‌ ట్రాఫిక్‌ గురించి ఇన్నేళ్లలో ఎవరూ పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్‌ మనస్సున్న ముఖ్యమంత్రన్నారు. కులం, మతంతో సంబంధం లేకుండా కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకం కింద రూ.లక్షా నూట పదహారు ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు.

ఆరేళ్లలో ఏం చేసినమో చూపిస్తాం..బీజేపీ ఒక్క పని చూపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చిన పైసలతోనే వారణాసి, పాట్నా, లక్నోలో రోడ్లు వేసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు.

మా పైసలు మేం అడిగితే వేర్పాటువాద ధోరణా? మేం వరదసాయం చేస్తుంటే బీజేపీ నిర్దాక్షిణ్యంగా అడ్డుపడిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మేం రూ.10వేలు ఇచ్చిన ఆరున్నర లక్షల మంది జాబితా కేంద్ర మంత్రి  కిషన్‌రెడ్డికి పంపిస్తామని... వాళ్లందరికీ బీజేపీ తలా రూ.25వేలు ఇవ్వాలని సవాల్‌ చేశారు.

గల్లీలో జరిగే ఎన్నికలకు ఢిల్లీ నుంచి పెద్దపెద్దోళ్లు దిగుతున్నారని... టీఆర్‌ఎస్‌ని చూస్తుంటే బీజేపీకి భయమేస్తోందా అని తారక రామారావు సెటైర్లు వేశారు. దేశంలో ఉన్న సమస్యలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేయాలని కేటీఆర్ మండిపడ్డారు.

ఓట్ల కోసం కోటి మంది హైదరాబాదీలను బలి తీసుకుంటారా అని మంత్రి నిలదీశారు. హైదరాబాద్ ప్రజలకు సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు చేస్తారని ఆయన ప్రశ్నించారు. దమ్ముంటే దేశంలో నిరుద్యోగం, పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓట్ల కోసం కోటి మంది హైదరాబాదీలను బలి తీసుకుంటారా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios