జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఖైరతాబాద్‌లో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జహీర్‌నగర్ చౌరస్తాలో ఆదివారం రోడ్ షో నిర్వహించిన ఆయన కేసీఆర్ నాయకత్వంలోనే హైదరాబాద్ అభివృద్ధి అని తేల్చి చెప్పారు.

ఆకలేస్తే 5 రూపాయలకే అన్నపూర్ణ భోజనం పెట్టారని.. బస్తీ దావాఖానాలు పెట్టామని, టీఆర్ఎస్ పాలనలో బస్తీలు బాగుపడ్డాయని కేటీఆర్ గుర్తుచేశారు. నగరంలో మంచినీటి సమస్యను పరిష్కరించామని, ఆకతాయిల ఆగడాలు, మత కల్లోలు, బాంబు పేలుళ్లు లేవని.. పెట్టుబడులు తరలి వస్తున్నాయని మంత్రి చెప్పారు.

ఆరేళ్లు ప్రశాంతంగా వున్న హైదరాబాద్‌లో చిచ్చు పెడుతున్నారని.. టీఆర్ఎస్‌ పాలనలో బస్తీలు బాగుపడ్డాయని కేటీఆర్ తెలిపారు. ప్రకాశ్ జవదేకర్ టీఆర్ఎస్ పాలనపై ఒక ఛార్జ్ షీట్ వేశారని.. మేము 132 కోట్ల ఛార్జ్‌షీట్లు బీజేపీ పాలనపై వేస్తామని ఆయన ఎద్దేవా చేశారు.

మా పాలనపై ఎందుకు ఛార్జ్‌షీట్లు వేస్తారని.. తెలంగాణ అమలవుతున్నట్లు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పథకాలు అమలవుతున్నాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కరోనా కష్టకాలంలో బీజేపీ పెద్దలు ఏమయ్యారు..? హైదరాబాద్‌లో వరద కష్టాలు వస్తే ప్రజల వద్దు వెళ్లింది ఎవరని మంత్రి నిలదీశారు.

భాగ్యలక్ష్మీ గుడి దగ్గరే ఎందుకు పంచాయితీ పెట్టారు.. హైదరాబాద్‌ను విశ్వనగరం చేయాలనేది తమ నినాదమైతే.. విద్వేష నగరంగా చేయాలనేది వాళ్ల నినాదమని కేటీఆర్ దుయ్యబట్టారు.

డిసెంబర్ 4 తర్వాత పదివేల రూపాయల వరద సాయం అందించే బాధ్యత తమదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సారి తప్పకుండా సెంచరీ కొడతామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.