మహా  కూటమి పేరుతో జతకట్టి సీట్లు పంచుకోవడం కూడా చేతకానివారు తెలంగాణలో అధికారంలోకి వస్తే పాలన ఎలా చేస్తారో ప్రజలే ఆలోచించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. చాలా కష్టపడి అర్థరాత్రి అభ్యర్థులను ప్రకటించినా కాంగ్రెస్ పార్టీకి నిరసనల సెగ తప్పలేదని అన్నారు. గాంధీ భవన్ ఆ పార్టీ కార్యకర్తలు సెలైన్లు ఎక్కించుకుంటూ మరీ ఆందోళన చేస్తున్న ఓ పోటోను తాను పేపర్లో చేశానని...అది గాంధీ భవనా లేక గాంధీ ఆస్పత్రా అని అనుమానం కలిగిందని కేటీఆర్ కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు. 

హైదరాబాద్‌లోని జలవిహార్‌లో దివ్యాంగుల పెన్షనర్ల కృతజ్ఞత సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్థరాత్రి 11 గంటల తర్వాత టికెట్ల ప్రకటన చేసినా కాంగ్రెస్ పార్టీకి నిరసనలు ఆగడం లేదని అన్నారు. పొద్దున సమయంలో అభ్యర్థులను ప్రకటిస్తే పరిస్థితి మరెలా ఉండేదోనని ఎద్దేవా చేశారు. అప్పుడు గాంధీ భవన్ తలుపులు, పర్నీచర్ ఉండేదికాదన్నారు. మొత్తంగా గాంధీ భవన్ ను పగలగొడతారనే భయంతోనే అర్థరాత్రి అభ్యర్థులను ప్రకటించారని కేటీఆర్ సెటైర్లు వేశారు.  

చంద్రబాబు నాయుడు తాను సీఎంగా వుండే ఏపిని బాగుచేసుకోడానికి ప్రయత్నిస్తాడు కానీ తెలంగాణకు ఏం మంచి చేస్తాడని ప్రశ్నించారు. ఆయనకు తెలంగాణ పై ప్రేమే ఉంటే ఇక్కడ సాగునీటి కోసం నిర్మిస్తున్న  ప్రాజెక్టులపై కేంద్రానికి 30 -40 ఉత్తరాలు రాసి అడ్డుకోవాలని ప్రయత్నిస్తారా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు కు మద్దతిస్తే తెలంగాణకు ద్రోహం చేసినట్లేనని కేటీఆర్ విమర్శించారు. 

 దివ్యాంగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తోందని కేటీఆర్ గుర్తుచేశారు. వారికి పెన్సన్లు పెంచామని, 4శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్లలో 5శాతం దివ్యాంగులకే కేటాయించామని అన్నారు. భవిష్యత్ మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి మరింతగా కృషి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.