దేశ సంపదను అన్ని వర్గాలకు సమానంగా పంచాలి.. రాజకీయాలపై కాకుండా ఆర్థిక అంశాలపై నాయకులు దృష్టి పెట్టాలి: కేటీఆర్
దేశంలోని సంపదను అన్ని వర్గాలకు సమానంగా పంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

దేశంలోని సంపదను అన్ని వర్గాలకు సమానంగా పంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయ నాయకులు రాజకీయాలపై కాకుండా ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టాలని అన్నారు. గురువారం రోజున ఎన్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన డీకోడ్ ది ఫ్యూచర్- ది నేషనల్ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్ ప్రసంగించారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఏడాదంతా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని.. నాయకులు దృష్టి అంతా ఎన్నికలపైనే పెడుతున్నారని.. ఇప్పుడున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పారు. ఇతర దేశాల్లా మన దేశంలోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టిసారిస్తే నంబర్ వన్‌గా ఎదుగుతామని అన్నారు.
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమని.. అయినప్పటికీ దేశ సంపదలో ఎక్కువ భాగం కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఉందని విమర్శించారు. 1980లలో భారతదేశం, చైనాలు దాదాపు ఒకే విధమైన జీడీపీలను కలిగి ఉన్నాయని గుర్తుచేశారు. ఇప్పుడు చైనా 18 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉందని.. భారతదేశం ఇప్పటికీ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉందని అన్నారు. భౌగోళిక సవాళ్లు ఉన్నప్పటికీ జపాన్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని అన్నారు. అభివృద్దిపై దృష్టి సారించినందు వల్లే చైనా, జపాన్‌లో రాణించాయని.. భారత్‌లో మాత్రం నాయకులు రాజకీయాలపై దృష్టిపెట్టారని విమర్శించారు.
దేశంలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని.. మొత్తం జనాభాలో 60 శాతం మంది యువతేనని తెలిపారు. అయితే దేశంలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుందని.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆలోచన చేయడం లేదన్నారు.
తెలంగాణ సహజ వనరులను, మానవ వనరులను సద్వినియోగం చేసుకుని 15 శాతం సీఏజీఆర్ సాధించిందని అన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు కాగా.. అది ఇప్పుడు రూ.2.75 లక్షలకు పెరిగిందని చెప్పారు. అయితే జాతీయ సగటు మాత్రం రూ.1.49 లక్షలుగా ఉందన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ వెలుగొందుతున్నదని తెలిపారు. 1/3వ వంతు వ్యాక్సిన్లు ఇక్కడే తయారవుతున్నాయని చెప్పారు.