హయత్నగర్ వరకు మెట్రో విస్తరణ.. మళ్లీ సీఎం అయ్యేది కేసీఆరే: మంత్రి కేటీఆర్
తెలంగాణలో అభివృద్ది, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా ముందుకు సాగుతున్నాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. పేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.

తెలంగాణలో అభివృద్ది, సంక్షేమం జోడెద్దుల మాదిరిగా ముందుకు సాగుతున్నాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. పేదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. సంపద సృష్టించి పేదలకు పంచుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడక ముందు తలసరి ఆదాయం రూ. 1.20 లక్షలు మాత్రమే అని అన్నారు. రాష్ట్రం ఏర్పాటైన ఏడేళ్లలో తలసరి ఆదాయం రూ. 2.70 లక్షలకు చేరిందని తెలిపారు.
స్వచ్ఛ సర్వేక్షన్‌లో తెలంగాణ నుంచే 20 గ్రామాలు అవార్డులు సొంతం చేసుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఏ పల్లె, ప్టటణానికి పోయిన పచ్చదనమే కనిపిస్తోందన్నారు. డిసెంబర్ చివరి నాటికి ఎస్‌ఎన్‌డీపీ కింద 17 నాలాల పనులు పూర్తి చేస్తామని తెలిపారు. నాలాల పునరుద్దరణతో ముంపు సమస్య తీరిపోతుందని చెప్పారు. ఎస్‌ఎన్‌డీపీ రెండో దశ పనులను కూడా త్వరలో చేపడుతామని తెలిపారు. అభివృద్దిలో కొత్త నమునాను భారతదేశం ముందు తెలంగాణ ఆవిష్కరిస్తుందని చెప్పారు. నోటిమాటలతో ఇదంతా సాధ్యం కాలేదని.. పట్టిష్టమైన ప్రణాళికతో పనిచేస్తేనే సాకారం అయిందని అన్నారు.
అటు నాగోలు, ఇటు నాగోలు వరకు మెట్రో ఉందని.. ఈ మధ్యలో ఉన్న ఐదు కిలోమీటర్లను కూడా రెండో ఫేజ్‌లో పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత ఈ పని పూర్తి చేస్తామని తెలిపారు. అదే విధంగా ఎల్‌బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రోను విస్తరించబోతున్నామని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేది సీఎం కేసీఆరే.. అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ పార్టీనేనని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఆ దిశగా ప్రజారవాణాను విస్తరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.