కాంగ్రెస్ అంటే కన్నీళ్లు, కష్టాలు అని.. బీఆర్‌ఎస్ అంటే సాగునీళ్లు, సంక్షేమం అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి చేయలేదని, కరెంటు, నీళ్లు ఇవ్వలేదని.. అలాంటిది ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంటూ వస్తుందని విమర్శించారు.
కాంగ్రెస్ అంటే కన్నీళ్లు, కష్టాలు అని.. బీఆర్‌ఎస్ అంటే సాగునీళ్లు, సంక్షేమం అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి చేయలేదని, కరెంటు, నీళ్లు ఇవ్వలేదని.. అలాంటిది ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంటూ వస్తుందని విమర్శించారు. 150 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ గ్యారంటీ ఎప్పుడో తీరిపోయిందని సెటైర్లు వేశారు. మంత్రి కేటీఆర్ ఆదివారం రోజున మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మందమర్రిలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మొండి చెయ్యి పార్టీని, చెవిలో పువ్వుపెట్టే పార్టీని నమ్మొద్దని ప్రజలను కోరారు. కాంగ్రెస్ గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు సీఎంలు అవుతారని.. సీఎంలుగా ఎవరూ ఉండాలనేది కూడా ఢిల్లీ నుంచి కవర్ వస్తుందని విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా రావన్నారు. రైతు బంధు కేసీఆర్ కావాలా? రాబంధు కాంగ్రెస్ కావాలా? అని ప్రశ్నించారు. 24 గంటల కరెంటు ఇస్తున్న సీఎం కేసీఆర్ కావాలా? 3గంగల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలో ఒక్కసారి ఆలోచించుకోవాలని అన్నారు. బీజేపీ విషయానికి వస్తే.. ప్రధాని మోదీ మనసులో తెలంగాణపై ప్రేమ లేదని.. ఆయన రాష్ట్రానికి రావడమే తప్ప ఇచ్చిందేమీ లేదని విమర్శించారు.
సీఎం కేసీఆర్.. సింగరేణిని లాభాల బాటలో నడిపిస్తున్నారని, కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్.. ఓయూ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని మంత్రి కేటీఆర్ చెప్పారు. మంత్రులుగా ఉన్నవాళ్లు నియోజకవర్గాల్లో చేయని పనులను.. చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ చేశారని ప్రశంసించారు. భవిష్యత్‌లో బాల్క సుమన్ మంత్రి అయితే ఇంకా అద్భుతాలు చేస్తారని చెప్పారు.
