కరోనా కట్టడిలో వచ్చే రెండు వారాలు చాలా కీలకమన్నారు మంత్రి కేటీఆర్. సచివాలయంలో కేటీఆర్ అధ్యక్షతన బుధవారం కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ భారీగా పెంచామని మంత్రి అన్నారు.

తెలంగాణలో ప్రస్తుతం 1.5 లక్షల రెమిడిసివర్ నిల్వలున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇంజెక్షన్ల వినియోగంపై ప్రభుత్వ పర్యవేక్షణ వుంటుందన్నారు. ప్రభుత్వ హోం ఐసోలేషన్ కేంద్రాల్లో మందుల కొరత లేదని కేటీఆర్ వెల్లడించారు. ఇంటింటి సర్వే చేస్తూ అవసరమైన వారికి మెడికల్ కిట్లు ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తయ్యిందని కేటీఆర్ పేర్కొన్నారు. 

కాగా, ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి క్యాబినెట్ నిన్న‌ ఆమోదం తెలిపింది.

Also Read:ఏపీ, కర్ణాటక నుంచి రోగులు.. తెలంగాణకు భారం: హరీశ్ సంచలన వ్యాఖ్యలు

పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా కొన‌సాగుతున్నారు.

మరోవైపు తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,723 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,11,711 కి చేరింది. వీరిలో 4,49,744 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం తెలంగాణలో 59,113 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇక రాష్ట్రంలో కరోనాతో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,834 కి చేరింది. ఈ ఒక్కరోజు రాష్ట్రంలో 5695 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.