ఫస్ట్‌వేవ్ తర్వాత రాష్ట్రంలో మౌలిక వసతులు పెంచామన్నారు మంత్రి హరీశ్ రావు. బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఐసీయూ బెడ్లను 3 వేల నుంచి 11 వేలకు పెంచామని హరీశ్ రావు వెల్లడించారు.

కరోనా నియంత్రణకు ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్నామని.. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి కరోనా రోగులు చికిత్స నిమిత్తం తెలంగాణ వస్తుండటంతో లెక్కల్లో తేడా వస్తోందని మంత్రి చెప్పారు. ఇది తెలంగాణకు తలకుమించిన భారంగా మారిందని హరీశ్ రావు తెలిపారు.

తెలంగాణకు వలస వచ్చిన వారి పాజిటివ్ కేసులను కూడా పరిగణనలోనికి తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆక్సిజన్ సరఫరాను 450 నుంచి 650 మెట్రిక్ టన్నులకు పెంచాలని హరీశ్ రావు ఆదేశించారు. రెమిడిసివర్ ఇంజెక్షన్లను రోజుకు 20 వేలు కేటాయించాలని ఆయన కేంద్రానికి విజ్ఙప్తి చేశారు.

Also Read:తెలంగాణలో లాక్‌డౌన్: ఏపీ వాహనాలకు నో ఎంట్రీ, అత్యవసర వాహానాలకు పర్మిషన్

టోసిలిజుమాబ్ మందులను రోజుకు 1500కు పెంచాలని హరీశ్ రావు కోరారు. తెలంగాణలో రోజుకు 2 లక్షల టెస్టింగ్ కిట్లు అవసరమని మంత్రి తెలిపారు. మొదటి డోసును పూర్తి చేయడానికి కోటి 29 లక్షల వ్యాక్సిన్లు అవసరమని హరీశ్ రావు స్పష్టం చేశారు. తెలంగాణకు తక్షణం 2 వేల వెంటిలేటర్లు అవసరమని మంత్రి చెప్పారు.

రాష్ట్రంలో 27,039 బృందాలు ఫీవర్ సర్వేను చేస్తున్నాయని.. ఇప్పటి వరకు 60 లక్షల ఇళ్లలో పరీక్షలు నిర్వహించామని హరీశ్ రావు పేర్కొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి హర్షవర్థన్ మాట్లాడుతూ.. తెలంగాణలో కోవిడ్ తగ్గుముఖం పడుతోందని అన్నారు. వ్యాక్సిన్, వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ కోటా పెంచుతామని హర్షవర్థన్ హామీ ఇచ్చారు.