సారాంశం
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి కేటీఆర్ బస్తీ మే సవాల్ విసిరారు. సూర్యాపేటలో ఐటీ హబ్‌ను ప్రారంభించిన కేటీఆర్ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. సూర్యాపేటలో ఎవరికి డిపాజిట్ రాదో తేల్చుకుందాం రా.. అంటూ ఛాలెంజ్ విసిరారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. సూర్యాపేటలో ఎవరికి డిపాజిట్ రాదో తేల్చుకుందాం .. దమ్ముంటే రా.. అంటూ ఎంపీ కోమటిరెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్ని ఎత్తులు, కుట్రలు చేసినా సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి విజయాన్ని ఆపలేరని దీమా వ్యక్తం చేశారు. సూర్యాపేటలో ఐటీ హబ్‌ను ప్రారంభించిన కేటీఆర్.. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
దమ్ముంటే నేరుగా కొట్లాడాలని, కానీ..శిఖండి రాజకీయాలు చేయరాదని మండిపడ్డారు. మంత్రి జగదీశ్ రెడ్డి.. 2000లో కేసీఆర్‌కు ఒక తమ్ముడిలాగా, ఉద్యమానికి ఆకర్షితుడై ఆయన వెంట నడిచారని గుర్తు చేశారు. ఆయన ఏనాడూ పదవులపై ఆకాంక్షతో రాలేదని, కేసీఆర్ మాత్రమే తెలంగాణకు న్యాయం చేయగలరని ఆయన నమ్మరాని, రాష్ట్రాన్ని సాధిస్తారనే నమ్మకంతో ఒక సైనికుడిలాగా 24 ఏళ్ల కిందట కేసీఆర్‌తో కలిసి నడిచారని గుర్తు చేశారు. అలాంటిది నేడు కొందరు వ్యక్తులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో యుద్ధం నేరుగా చేయాలని , లేదా చేసిందే చెప్పాలని మంత్రి కేటీఆర్ అన్నారు. 55 ఏళ్లు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అదే విధంగా.. తాము కూడా ఈ పదేండ్లలో ఏం చేశామో చెప్తామని తెలిపారు. సూర్యాపేటలో మెడికల్ కాలేజీ ప్రారంభమైందని, పీజీ సీట్లు కూడా వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు.
నల్గొండలో ప్రారంభించుకున్న ఐటీ హబ్ అత్యద్భుతమని, రాష్ట్రంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీ హబ్ నిర్మితమైందని, నల్గొండ నగరాన్ని భూపాల్‌రెడ్డి అద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు. అలాగే.. ప్రభుత్వ మెడికల్ కళాశాల అతి త్వరలో ప్రారంభం కాబోతుందని ప్రకటించారు. కవులు కళాకారులకు నిలయమైన నల్లొండ జిల్లాలో కళాభారతికి ఏర్పాటుకు రూ.93కోట్లు నిధులు కేటాయించామని తెలిపారు. ఉదయ సముద్రం, తీగెల వంతెన, వరద నీటి కాలువలు, ఇంకా ఎన్నో పనులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం వంద కోట్ల నిధులను వేచించిందని తెలిపారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోతలరాయుడని, ఆయన చేయలేని పనులను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చేసి చూపించాడని మంత్రికేటీఆర్ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరెంటు పోతే వార్త అని.. కాంగ్రెస్ హయాంలో కరెంటు వస్తే వార్త అని ..24 గంటల విద్యుత్ వస్తోందో లేదో చెక్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు అందరూ రావాలని సవాల్ విసిరారు. రైతులకు ఉచితంగా కరెంటు ఇచ్చే రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనన్నారు.