హైదరాబాద్ లోని వనస్థలిపురం రైతుబజార్ పక్కన నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభం అయ్యాయి.  రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ 184 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు. రూ.28 కోట్లతో 324 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించింది ప్రభుత్వం. 9 అంతస్తుల్లో మూడు బ్లాక్ లుగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించారు.

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూం ఇళ్లలోకి గృహ ప్రవేశం చేస్తున్న వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇప్పుడు డబుల్ బెడ్ రూంలు నిర్మించబడిన ఈ ప్రాంతంలో ఐదేళ్ల కిందట ఈ రెండెకరాల స్థలం అపరిశుభ్రమైన వాతావరణం ఉండేది. 

స్థానిక నేత జిట్టా రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఇక్కడ డబుల్ బెడ్ రూం. ఇల్లు శాంక్షన్ చేయించాం. ప్రైవేట్ బిల్డర్ కడితే ఎంత నాణ్యంగా ఉంటాయో ఆ స్థాయిలో, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న కంపెనీ లిఫ్ట్ లాంటి అనేక సౌకర్యాలతో కట్టించామని అన్నారు.

ఇలాంటి ఇండ్లు దేశంలోని ఏ రాష్ట్రంలో, ఏ ప్రభుత్వం చేయలేదని చెప్పుకొచ్చారు. 40,50 లక్షల విలువైన అపార్ట్ మెంట్ ఒక్కొక్కటి అని అన్నారు. లక్ష ఇండ్లు దాదాపు పూర్తయ్యాయని... ఇప్పటికి పదివేల ఇండ్లు ఇచ్చేశామని మిగతావి చివరి దశలో ఉన్నాయని అన్నారు.