హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. అయితే కీలకఘట్టం ఫలితాలు. ఫలితాలపై ఏ పార్టీకి ఆపార్టీ అంచనాలు వేసుకుంటున్నాయి. అటు ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియా సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ మరింత వేడి రాజేస్తున్నాయి. 

జాతీయ మీడియా సంస్థలు అధికార పార్టీ టీఆర్ఎస్ కు అనుకూలంగా పోల్ ప్రకటించడంతో, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ మాత్రం ప్రజాకూటమికి అనుకూలంగా ఇచ్చారు. అయితే ఏ సర్వే నమ్మాలో అర్థం కాక ప్రజలు బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు కూడా.  

అయితే టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ మాత్రం ఈ ఎన్నికలపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జాతీయ మీడియా సంస్థలు ప్రకటించిన పోల్ ఫలితాల కంటే అత్యధికంగా స్థానాలు కైవసం చేసుకుంటామని ప్రకటిస్తున్నారు. కేటీఆర్ అంచనాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

మంత్రి కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీలో 100 స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ ఎన్నిలక ఫలితాలే పునరావృతమవుతాయని కేటీఆర్ చెప్తున్నారు. 

గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ 15 నుంచి 17 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే కరీంనగర్ జిల్లాలో 12 నుంచి 13 స్థానాలు కైవసం చేసుకుంటామని ప్రకటించారు. అలాగే ఖమ్మం జిల్లాలోనూ టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని తెలిపారు. 

అలాగే ఈ ఎన్నికల్లో బీజేపీ 100 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోతుందని చెప్పారు. తమకు బీజేపీ రెండు చోట్లే పోటీ ఇస్తుందని అది ఒకటి ముషీరాబాద్, రెండు అంబర్ పేట నియోజకవర్గాలు మాత్రమేనన్నారు. ఈసారి బీజేపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు. 

అలాగే టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ 75వేల మెజారిటీతో గెలుపొందనున్నట్లు జోస్యం చెప్పారు.

తెలంగాణలో భారీగా పోలింగ్ శాతం నమోదు కావడం టీఆర్ఎస్ కు మైనస్ అవుతుందని చెప్పడం సరికాదన్నారు. పోలింగ్ శాతం అధికంగా నమోదైందంటే టీఆర్ఎస్ గాలి వీచినట్లేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాసంక్షేమ పథకాలు, మేనిఫెస్టో, పాలనపై నమ్మకమే అత్యధిక పోలింగ్ కు నిదర్శనమంటున్నారు.