నల్గొండ: తల్లిదండ్రులను కోల్పోయిన ఓ అనాధ బాలికకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచాడు. అయినవారందరిని కోల్పోయిన బాలికకు ప్రభుత్వమే ఆదుకుంటుందని... ఈ మేరకు ఆమెకు సహాయం చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ కు మంత్రి ఆదేశించారు. 

వివరాల్లోకి వెళితే...నల్గొండ జిల్లా మునుగోడు మండలం చొల్లేడు గ్రామానికి చెందిన బొడ్డు అంజయ్య-పద్మ దంపతుల ఓ కూతురు, కుమారుడు. అయితే రెండేళ్లక్రితమే అంజయ్య ఆత్మహత్య చేసుకోగా... ఆ తర్వాతి ఏడాది అతడి కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటినుండి కూతురు వందన ఆలనా పాలనను చూసుకుంటూ పద్మ జీవించేది.

కానీ ఇటీవల పద్మ కూడా తీవ్ర అనారోగ్యం పాలయి మృతిచెందిది. దీంతో అయినవారందరినీ కోల్పోయిన వందన అనాధగా మారింది. తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న బాలికను చూసి అందరూ పాపం అనుకున్నారే తప్ప ఆదుకోడానికి ముందుకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ బాలికను ఆదుకోవాలంటూ ఓ వ్యక్తి రిక్వెస్ట్ చేయడంతో వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు.

''అనాధగా మారిన వందనను ఆదుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ను కోరుతున్నాను. ఆమెను గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ లో చేర్చాలని... అన్ని సదుపాయాలు కల్పించాలని కోరుతున్నా'' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

 

కేటీఆర్ ఆదేశాలతో కదిలిన జిల్లా యంత్రాంగం బాలికను స్కూళ్లో చేర్పించడమే కాకుండా తక్షణ అవసరాలకు ఆర్థికసాయం కూడా ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ మేరకు కేటీఆర్ కు ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. '' సార్, మునుగోడు మండల తహసిల్దార్ మరియు జిల్లా వెల్ఫేర్ అధికారులు వందన కుటుంబాన్ని  కలిశారు. బాలికను కెజిబివి లో ఆరవ తరగతిలో చేర్చారు. అలాగే తక్షణ ఆర్థిక అవసరాల కోసం రూ.30000 లను కుటుంబానికి అందించారు'' అంటూ కలెక్టర్ ట్వీట్ చేయగా దీనికి కేటీఆర్ మరోసారి స్పందించారు. '' ధన్యవాదాలు కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ గారు'' అంటూ మంత్రి స్పందించారు.