Asianet News TeluguAsianet News Telugu

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి కేటీఆర్.. కొల్లాపూర్‌‌ టీఆర్ఎస్‌లో వర్గపోరు‌కు చెక్ పడినట్టేనా..?

తెలంగాణ ఐటీ, పురపాల శాఖ మంత్రి కేటీఆర్.. శనివారం నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌‌లలో పర్యటిస్తున్నారు. అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం కొల్లాపూర్ వచ్చిన మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లారు. 

Minister KTR Goes to Jupally Krishna Rao Home
Author
First Published Jun 18, 2022, 4:04 PM IST

తెలంగాణ ఐటీ, పురపాల శాఖ మంత్రి కేటీఆర్.. శనివారం నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌‌లలో పర్యటిస్తున్నారు. అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం కొల్లాపూర్ వచ్చిన మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లారు. కొల్లాపూర్‌ టీఆర్ఎస్‌‌లో వర్గపోరు నెలకొన్న నేపథ్యంలో కేటీఆర్.. జూపల్లి ఇంటికి వెళ్లి కలవడం చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజులుగా స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి మధ్య విభేదాలున్నాయి. ఈ క్రమంలోనే జూపల్లి పార్టీ వీడతారనే ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే కేటీఆర్.. జూపల్లి ఇంటికెళ్లి పార్టీలో వర్గపోరు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చర్చించినట్టుగా తెలుస్తోంది. 

కొద్ది రోజులుగా ఉమ్మడి మహబూబ్ నగర్‌ టీఆర్ఎస్‌లో జూపల్లి విషయం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్​రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గాల మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్న సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే జూపల్లి కొన్ని నెలల క్రితం ఖమ్మం జిల్లాలో పర్యటించడం హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసంతృప్తి నేతలుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లిన జూపల్లి.. తుమ్మలతో రెండు గంటల పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశమయ్యారు. 

ఈ క్రమంలోనే జూపల్లి పార్టీ మారనున్నారనే ప్రచారం సాగుతూ వచ్చింది. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి కూడా జూపల్లి హాజరు కాకపోవడం.. ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే దానిపై స్పందించిన జూపల్లి.. తాను టీఆర్ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఆయన పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నేడు కేటీఆర్.. జుపల్లి ఇంటికి వెళ్లడం ద్వారా ఆయనకు ఏదో ఒక హామీ ఇచ్చి ఉంటారనే ప్రచారం సాగుతుంది. మరి కేటీఆర్..  జూపల్లి ఇంటికి వెళ్లిన నేపథ్యంలో కొల్లాపూర్ టీఆర్ఎస్‌లో వర్గపోరుకు పరిష్కారం దొరుకుతుందని కొందరు భావిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం అలాంటిదేమి ఉండకపోవచ్చని.. పార్టీలో ఎలాంటి విబేధాలు లేవనే సంకేతాలు ఇవ్వడం కోసమే కేటీఆర్.. జూపల్లి ఇంటికి వెళ్లి ఉంటారని అనుకుంటున్నారు. 

మరోవైపు ఇటీవల ఖమ్మం పర్యటనలో కూడా కేటీఆర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పొంగులేటి, తుమ్మలతో పాటు జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పువ్వాడ అజయ్‌కుమార్‌తో సీనియర్‌ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య కొనసాగుతున్న వాగ్వాదంపై ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. తుమ్మల నాగేశ్వరరావు అనుభవం ఉపయోగించుకోవాలన్నారు. జనంలో ఉన్న పొంగులేటి వంటి నాయకులను కలుపుకుని పోవాలని సూచించారు. జిల్లా నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు వారం రోజుల్లో ముఖ్య నేతలతో హైదరాబాద్‌లో మరో సమావేశం ఏర్పాటు చేస్తానని కేటీఆర్‌ తెలిపారు. తగిన సమయంలో పార్టీ తుమ్మల, పొంగులేటిలకు తప్పకుండా ప్రతిఫలమిస్తుందని ఆయన ఇద్దరు నేతలకు హామీ ఇచ్చారు. ఇద్దరికీ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని కేటీఆర్ చెప్పినట్టుగా సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios